జీవో 111 ఎత్తేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం
ధాన్యం కొనుగోలుకూ మంత్రివర్గం ఆమోదం
రాష్ట్రంలో కొత్తగా ఆరు ప్రైవేట్ యూనివర్శిటీలు
సీఎం కెసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం కెసీఆరే స్వయంగా మీడియాకు ఈ విషయాలు వెల్లడించారు. హైదరాబాద్ నగరంపై తీవ్ర ప్రభావం చూపే జీవో 111ను ఎత్తేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఆ జలాశయాలు అవసరం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదే అంశంపై సీఎస్ ఆధ్వర్యంలో త్వరలోనే ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. దీంతోపాటు మే 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతిని చేపట్టనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో పండి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
కేంద్రం చేతకానితనంతో చేతులెత్తేసినంత మాత్రాన తాము వెనకడుగు వేయం అని..రైతులు ఎవరూ ఆందోళన చెంది తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్రంలో ఆరు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వటానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో అన్ని యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం మూడున్నర వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఇబ్బందులు, ఆరోపణల నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల తరహాలో కామన్ బోర్డు ఏర్పాటు చేసి నియామకాల్ని పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కేంద్రం, బిజెపి తీరుపై మండిపడ్డారు. బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అనే సిద్ధాంతంతో పనిచేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో రూ. 1960 కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని, మొత్తం 3,4 రోజుల్లోనే ధాన్యం కొంటామన్నారు.