Telugu Gateway
Telangana

అపార్ట్ మెంట్ కనీస ధర 5 కోట్లు

అపార్ట్ మెంట్ కనీస  ధర 5 కోట్లు
X

విలాసానికి చిరునామా అయినా ట్రంప్ టవర్స్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రాబోతున్నాయి. దేశంలోని పలు కీలక నగరాల్లో ఇప్పటికే ట్రంప్ టవర్స్ ఉండగా..ఇప్పుడు హైదరాబాద్ కూడా ట్రంప్ ఫ్యామిలీ భాగస్వామ్యంతో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్ కు వేదిక కానుంది. నగరంలో ప్రస్తుతం విలాసవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వస్తున్న కోకాపేట లోనే ఇది కూడా రానుంది. ప్రతిపాదిత ట్రంప్ టవర్ ప్రాజెక్ట్ కు ఇప్పటికే రెరా అనుమతులు కూడా దక్కాయి. కోకాపేటలో మొత్తం 65 అంతస్తులతో ఈ రెండు టవర్ల నిర్మాణం జరగనుంది. ఇవి 240 మీటర్ల ఎత్తుతో దక్షిణ భారత దేశంలోనే ఎత్తైన టవర్ లు గా నిలవనున్నాయి. త్వరలో జరగనున్న ఈ ప్రాజెక్ట్ భూమి పూజకు డోనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు.

హైదరాబాద్ లో ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ ను ట్రంప్ ఆర్గనైజేషన్ , ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మొత్తం 450 ప్రీమియం అపార్ట్ మెంట్స్ రాబోతున్నాయి. మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయనున్నారు. ముంబై కి చెందిన ట్రిబెకా డెవలపర్స్ ఇండియాలో ట్రంప్ టవర్స్ బ్రాండ్ ప్రతినిధిగా ఉంది. భూమి ధర కాకుండా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయటానికి గరిష్టంగా 1800 కోట్ల రూపాయల వరకు అవుతుంది అని వెల్లడించారు. విచిత్రం ఏమిటి అంటే ఈ ట్రంప్ టవర్స్ లో ఉండే మొత్తం 16 పెంట్ హౌస్ ల్లో ఇప్పటికే ఎనిమిది అమ్ముడు అయ్యాయి కూడా. ఒక పెంట్ హౌస్ ఏకంగా 62 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు ట్రిబెకా డెవలపర్స్ ఫౌండర్ కల్పేష్ మెహతా వెల్లడించారు. కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ లో మంగళవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించారు.

Next Story
Share it