జాతీయ పార్టీ పెట్టాలంటే 'ప్రత్యేక విమానం' ఉండాలా?!

దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి కూడా సొంతంగా ఓ విమానం లేదు. పార్టీ నేతలకు ఎవరికైనా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న బిజెపికి కూడా సొంతంగా విమానం లేదు. అధికారంలో ఉన్న వారికి కార్పొరేట్లు..కాంట్రాక్టర్లు అడిగిందే తడవుగా విమానాలతోపాటు ఏమైనా ఏర్పాటు చేస్తారు. ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కామనే. కానీ అసలు జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కెసీఆర్ తన రాజకీయ పర్యటనల కోసం ఏకంగా పార్టీకి సొంత విమానం కొనుగోలు చేయాలని నిర్ణయించటం దుమారం రేపుతోంది. నిజంగా ఇది పెద్ద సంచలనమే అని చెప్పుకోవచ్చు. సుమారు 80 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 12 సీట్ల సామర్ధ్యంతో కూడిన విమానం కొనుగోలుకు టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని..దీనికి నేతలు విరాళాలు ఇస్తున్నట్లు ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఎక్కడా వీటిని టీఆర్ఎస్ ఖండించకపోవటంతో ఇది నిజమే అని నిర్ధారణ అవుతోంది. జాతీయ పార్టీ ఏర్పాటుకు..అసలు ప్రత్యేక విమానం కొనుగోలుకు ఏమిటి సంబంధం అని ఓ సీనియర్ నేత ప్రశ్నించారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటుకు అసలు నిధుల కొరత సమస్యే కాదని ఇటీవల జరిగిన ప్లీనరీలో సీఎం కెసీఆర్ ప్రకటించారు. పార్టీ దగ్గర ఏకంగా వందల కోట్ల రూపాయల నగదు నిల్వలు ఉన్నట్లు స్వయంగా కెసీఆర్ వెల్లడించారు.
సొంత విమానం కొనుగోలు చేయాలన్న టీఆర్ఎస్ నిర్ణయం రాజకీయంగా ఆ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వందల కోట్ల రూపాయలు ఉన్న వారికి ఎవరికైనా విమానం కొనటం పెద్ద సమస్య కాదు. కానీ విమానాశ్రయాల్లోనే దాన్ని పార్క్ చేయాల్సి ఉన్నందున రోజుల లెక్కన దానికి పార్కింగ్ ఫీజులతోపాటు హ్యాంగర్ ఫీజుల వంటి ఉంటాయని చెబుతున్నారు. ఇది కూడా చాలా ఖరీదైన వ్యవహారమే. ముఖ్యంగా ప్రైవేట్ ఆదీనంలో ఉన్న విమానాశ్రయాల్లో అయితే ఈ చార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే ఎయిర్ పోర్ట్సు ఆధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధీనంలో ఉన్న వాటిలో అయితే కొంత తక్కువగా ఉంటాయి. ఇప్పుడు దేశంలో విమానాల అద్దెకు ఇచ్చే సంస్థలు ఎన్నో ఉన్నాయి. దీనికి దీర్ఘకాల ఒప్పందాలు కూడా చేసుకోవచ్చు. ఎన్నికల సమయంలోనే అందుబాటు ఒకింత సమస్య అవుతుంది. కానీ ముందే ఒప్పందాలు చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. అలా కాకుండా ఏకంగా విమానం కొనుగోలు..అది కూడా పార్టీ నేతల విరాళాలతో కొంటున్నారు అంటే అది ఖచ్చితంగా ప్రజలకు తప్పుడు సంకేతం పంపుతుందని..దేశాన్ని పాలించిన పార్టీలకే సొంతంగా విమానాలు లేని సమయంలో ఓ ప్రాంతీయ పార్టీ విమానం కొనుగోలు చేయటం ప్రతిపక్ష పార్టీలకు ఓ ఆస్త్రం ఇచ్చినట్లు అవుతుందని ఓ నేత వ్యాఖ్యానించారు. దీంతోపాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన సొమ్ముతో విమానాలకు విరాళాలు..పేదలకు సాయం చేసి తమంత దాతలు ఎవరూ లేరని కొంత మంది చెప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారనే విమర్శలు ఆ పార్టీ నాయకుల నుంచే వస్తున్నాయి.