Telugu Gateway
Telangana

ప్రగతి భవన్ గోడ దాటని తెలంగాణ సర్కారు చేతలు

ప్రగతి భవన్ గోడ దాటని తెలంగాణ సర్కారు చేతలు
X

తెలంగాణ సర్కారు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ..చేతలు మాత్రం ప్రగతి భవన్ గోడ దాటడం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో అసలు టీఆర్ఎస్ పాత్రే చాలా తక్కువ అన్నారు. కిషన్ రెడ్డి మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ లో టీఆర్ఎస్ ఏమి సాధించిందో చెప్పాలన్నారు. ట్యాంక్ బండ్ నీళ్లను కొబ్బరినీళ్లగా మారుస్తానన్న మాటలు నిజం అయ్యాయా అని ప్రశ్నించారు. 'సికింద్రాబాద్ అసెంబ్లీలో ఒక డివిజన్ ను దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ మళ్ళీ ఎప్పుడైనా ఆ డివిజన్ వైపు చూసారా?. హైదరాబాద్ పాతబస్తీకి మెట్రో రైల్ నడవకపోవడానికి కారణం సీఎం కేసీఆర్- ఎంఐఎం పార్టీ నే!. మెట్రో పనులు ఆగిన కారణంగానే ఓల్డ్ సిటీకి వెళ్ళకపోవడం వాస్తవం కాదా? వాజ్ పేయి ఉన్నప్పుడే హైదరాబాద్ కు మెట్రో మంజూరు చేశారు.

తాత్కాలిక తాయిలాలు ఇచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తోంది. దుబ్బాక తరహాలో తండ్రీ-కొడుకుల పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారు. ఎన్నికల సంఘం అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేయాలి. 5లక్షల కుటుంబాలు వరదల వల్ల నిరాశ్రయులు అయ్యారు. గడిచిన ఐదేళ్లలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చారో లెక్క చెప్పాలి? అభివృద్ధి తక్కువ ఆర్భాటాలు ఎక్కువ- గోరంత చేసి కొండంత తండ్రి కొడుకులు చూపిస్తున్నారు. గడిచిన ఆరేళ్లుగా టీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలే బీజేపీ ప్రధాన ఎన్నికల ఎజెండాగా ప్రజల్లోకి వెళ్తున్నాము మేయర్ అభ్యర్థి ప్రకటన పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు' అని తెలిపారు.

Next Story
Share it