Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్

టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్
X

తెలంగాణ సీఎం కెసీఆర్ ముందు నుంచి చెబుతున్న‌ట్లు జాతీయ రాజ‌కీయాల్లో ఎంట్రీకి కీలక అడుగువేశారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) ఇక భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్)గా మార‌బోతుంది. దీనికి సంబంధించిన లాంఛనాన్ని కెసీఆర్ విజ‌యద‌శ‌మి నాడు పూర్తి చేశారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని అంద‌రూ ఏకాభిప్రాయంతో ఆమోదించారు. కొత్త పార్టీ బీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. పార్టీ జెండా, ఎజెండాపై టీఆర్ఎస్‌ నేతలకు కేసీఆర్ వివరించారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు బలపర్చారు. ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజర‌య్యారు. టీఆర్ఎస్ పేరు మార్పుపై తీర్మానం చేశారు.

అనంతరం సంతకాలు సేకరించారు.టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని పార్టీ సీనియర్‌ నేత, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌ బృందం ఢిల్లీకి తీసుకెళ్లనుంద‌ని స‌మాచారం. ఈసీఐ దీనిని పరిశీలించి ఆమోదం తెలపగానే బీఆర్‌ఎస్‌ ప్రస్థానం మొదలవుతుంది. జాతీయ పార్టీగా మారిన అనంతరం అఖిల భారత స్థాయిలో కొన్ని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలుత కిసాన్‌ సంఘ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అనేకమంది రైతు సంఘాల ప్రతినిధులతో కేసీఆర్‌ చర్చలు జరిపారు. జాతీయ పార్టీ కార్యకలాపాల కోసం ఢిల్లీలో ఇప్పటికే ఒక కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ నెల 9న ఈ కార్యాలయంలో ఒక సమావేశం కూడా టీఆర్‌ఎస్‌ నేతలు నిర్వహించనున్నట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. 2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్‌ను కేసీఆర్ ప్రకటించారు. ఈసీఐ ఆమోదం అనంతరం ఇది క‌నుమ‌రుగు కానుంది.

Next Story
Share it