టీఆర్ఎస్ వ్యూహాం ఏంటి?
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ధాన్యం సేకరణ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్, బిజెపిలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తప్పు మీది అంటే..మీదే అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా పార్లమెంట్ లో ఇదే అంశంపై నిరసనలకు దిగిన టీఆర్ఎస్ మంగళవారం నాడు అకస్మాత్తుగా సమావేశాల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ పార్టీ ఈ అంశంపై భవిష్యత్ లో ఎలా వ్యవహరించబోతుంది. ఆ పార్టీ వ్యూహం ఏమిటి అనే అంశంపై చర్చ ప్రారంభం అయింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏదో ఒక అనుకూల నిర్ణయం తెచ్చుకోకపోగా..పార్లమెంట్ బహిష్కరణ నిర్ణయం తీసుకోవటం టీఆర్ఎస్ కు లాభం చేకూరుస్తుందా? లేక దీని వెనకకారణాలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. దాన్యం సేకరణ విషయంలో కేంద్రం కూడా ఎదురుదాడికి దిగుతోంది. చేయాల్సిన సేకరణ చేయకుండా ఎప్పుడో వచ్చే సమస్య గురించి ఇప్పుడే సమాధానం చెప్పాలని కూర్చోవటం సరికాదంటూ టీఆర్ఎస్ ఎంపీలకు కేంద్ర మంత్రులు ఎంపీలకు కౌంటర్ ఇచ్చారు.
అయితే వారం రోజులుగా పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఆందోళనలు కేంద్రం పట్టించుకోకపోవడంతో పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించారు. తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని ఎంపీలు తెలిపారు. సభను బాయ్‌కాట్ చేయడం బాధకలిగించే విషయమన్నారు. కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని కేశవరావు ఆరోపించారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెబుతోందన్నారు. రబీలో పూర్తిగా ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుందన్నారు. అందుకే రబీ ధాన్యం బాయిల్డ్‌రైస్‌గా మారుస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. యార్డుల్లో ఉన్న ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తరలించకపోవడంతో ధాన్యం పాడైపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని ఎంపీ కేకే పేర్కొన్నారు.