వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫోన్ లో ఓ వ్యక్తిని దుర్భాషలాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి ఆ వ్యక్తికి ఫోన్ చేసి అభ్యంతకర వ్యాఖ్యలు చేయటంతో అవతలి వ్యక్తి కూడా అంతే స్థాయిలో ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు. తనను పదే పదే ఎందుకు అభ్యంతకర రీతిలో విమర్శిస్తున్నావంటూ కోపంతో పరుష పదజాలంతో ఆయనపై విరుచుకుపడ్డారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తమ గ్రామంలో పర్యటించలేదంటూ బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ మేరకు గ్రామ సమస్యలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రసమయి, నేరుగా రాజశేఖర్‌రెడ్డికి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించారు. హఠాత్పరిణామంతో కంగుతిన్న రాజశేఖర్‌రెడ్డి.. తాను సైతం ఎమ్మెల్యేపై తిట్ల దండకం అందుకున్నారు. బాధ్యతల గల ఎమ్మెల్యే అయి ఉండి ఇలా మాట్లాడటం ఏ మాత్రం సరికాదని రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. ఇద్దరూ అభ్యంతరకర భాషలోనే దూషణలకు దిగారు.