Telugu Gateway
Telangana

రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలకు లైంగిక వేధింపుల మినహాయింపులు ఉంటాయా?!

రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలకు లైంగిక వేధింపుల మినహాయింపులు ఉంటాయా?!
X

అధికార బిఆర్ఎస్ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే లకు లైంగిక వేధింపుల కేసు లో కూడా మినహాయింపులు ఉంటాయా?. వేధించి సారీ చెపితే సరిపోతుందా. ఇదే వెసులుబాటు ఒక్క బిఆర్ఎస్ ఎమ్మెల్యే లకేనా?. చట్టం ఎవరికైనా ఒకటే అని నాయకులు చెప్పే మాట ఏదో కంటి తుడుపు మాటేనా. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యవహారం చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. తొలుత తనపై ఆరోపణలు రాగానే ఎన్నికలు వస్తున్నాయని..అందుకే ప్రత్యర్థులు కుట్ర చేశారు అంటూ ప్రకటించారు. ఇప్పుడు మాత్రం అధిష్ఠానం చెప్పింది అని రాజయ్య జానకి పురం సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లారు. నవ్య భర్త, నవ్య, రాజయ్య కలిసి మీడియా తో మాట్లాడారు. తనపై లైంగిక ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్యకు ఎమ్మెల్యే రాజయ్య క్షమాపణలు చెప్పారు. ‘‘ మానసిక క్షోభకు గురిచేసుంటే క్షమించాలి. తెలిసి తెలియక తప్పు చేస్తే క్షమించాలి. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నా. నేను తప్పుచేశానని భావిస్తే మహిళలందరూ క్షమించాలి. అందరూ కలిసి పనిచేయాలని అధిష్టానం సూచించింది’’ అని మీడియా సాక్షిగా రాజయ్య క్షమాపణలు చెప్పారు. ఆ సమావేశంలోనే నవ్య తీవ్రమైన హెచ్చరికలు చేశారు. వెధవలు ఇప్పటికైనా మారాలి అన్నారు. తాను మాట్లాడిన ప్రతి మాట వాస్తవమేనని సర్పంచ్‌ నవ్య మరోసారి చెప్పారు.

‘‘ నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నా. చిన్నపిల్లలపై కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. మహిళలపై అరాచకాలను ప్రశ్నించాలి. మహిళలను ఎవరైన వేధిస్తే భరతం పడతా. సమాజంలో మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఏ స్థాయిలో ఉన్నా మహిళలకు గౌరవం ఇవ్వాలి. తప్పు చేసినట్లు ఒప్పుకుంటే ఎవరినైనా క్షమిస్తా. మళ్లీ అదే తప్పు చేస్తే ఊరుకోను. ’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తాటికొండ రాజయ్య తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, గ్రామానికి ఏమి చేస్తారో మీడియా ముఖంగా చెప్పాలని నవ్య పట్టుబట్టారు. ఎమ్మెల్యే రాజయ్య ఈ గ్రామానికి 25 లక్షల నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. కొద్దీ రోజుల క్రితం ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ హన్మకొండ జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేసింది. మాట విననందుకు తనపై రాజయ్య లైంగిక వేధింపులకు దిగుతున్నారని నవ్య పేర్కొంది. తనకు ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని.. తన మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని వేధిస్తున్నాడని నవ్య ఆరోపించారు. మరోవైపు నవ్య తనపై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే రాజయ్య ఖండించారు. ఇప్పుడు మాత్రం క్షమాణాలు చెప్పారు. రాజయ్య వ్యవహారం పై తెలంగాణ మహిళా కమిషన్ చాలా తాపీగా స్పందించి నివేదిక కోరింది. మరి ఇప్పుడు కేసు మొత్తం రాజీ అయిపోయినట్లేనా అన్న చర్చ సాగుతోంది.

Next Story
Share it