చంద్రబాబును గుర్తుకు తెస్తున్న ఎమ్మెల్సీ కవిత!
ఏదైనా విజయం సాధించినప్పుడో..రాష్ట్రానికి మేలు చేసే పని చేసినప్పుడు అభినందనలు తెలిపితే పర్వాలేదు కానీ..అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు..ఓ పార్టీ ఇంటి ముందు ధర్నా చేసిందని ఏకంగా మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు కెసీఆర్ కుమార్తెకు సంఘీభావం తెలుపుతూ తిరగటం రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం నాడు కూడా ఈ సంఘీభావ ప్రదర్శనలు కొనసాగాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ తోపాటు ఎంపీ దామోదర్ రావు..మరికొంత మంది నేతలు..కార్యకర్తలు కవిత ఇంట్లో ఆమెను కలసి సంఘీభావం తెలిపారు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా భారీ ఎత్తున కార్యకర్తలతో కవిత ఇంటికి చేరుకుంటూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై 2003 అక్టోబర్ లో తిరుపతిలో అలిపిరి వద్ద నక్సలైట్లు బాంబు దాడి చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ఈ దాడితో తనపై సానుభూతి వస్తుందని..అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. ఆ క్రమంలోనే అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలను హైదరాబాద్ తరలించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపేలా ఏర్పాట్లు చేశారు. అయినా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. జిల్లాల నుంచి చంద్రబాబు కు సంఘీభావం తెలిపేందుకు జనాన్ని తరలించినట్లు..ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కోసం కొంత మంది మంత్రులు...ఎమ్మెల్యేలు ఈ సంఘీభావ యాత్రలకు శ్రీకారం చుట్టారని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.