Telugu Gateway
Telangana

కెటీఆర్ సీఎం అంటూ ప్రచారం..టీఆర్ఎస్ కీలక సమావేశం

కెటీఆర్ సీఎం అంటూ  ప్రచారం..టీఆర్ఎస్ కీలక సమావేశం
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతలు గత కొంత కాలంగా కెటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఉన్నారు. కానీ అధిష్టానం నుంచి ఈ తరహా ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టాలనే ఆదేశాలు వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. మరో వైపు ప్రతిపక్షాలు కూడా ఇదే అదనుగా కెసీఆర్ ఇప్పటికైనా దళిత సీఎం హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి కొంత మంది నేతలు అయితే సీఎం పదవికి ఈటెల రాజేందరే అసలైన అర్హుడు అని, మరి కొంతమంది మాత్రం రసమయి బాలకిషన్ కు సీఎం పదవి ఇవ్వాలని ఇలా ఎవరికి తోచిన డిమాండ్లు వారు చేస్తున్నారు. ఈ తరుణంలో టీఆర్ఎస్ కీలక సమావేశం ఈ నెల7న జరగనుంది. ఇందులో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనే ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొంది. ఫిబ్రవరి 18న మంచి ముహుర్తం ఉందని, కెటీఆర్ ను సీఎం చేయటానికి ఇదే సరైన సమయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇది నిజమేనా?. లేక కేవలం ప్రచారం మాత్రమేనా అన్నది తెలియాలంటే ఈ సమావేశం వరకూ వేచిచూడాల్సిందే. ఈ నెల 7వ తేదీన మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులను ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. అయితే ఇది ఏజెండాకే పరిమితం అవుతారా? లేక కీలక నిర్ణయాలు ఉంటాయా అన్న అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Next Story
Share it