హూజారాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించిన కెసీఆర్
సస్పెన్స్ వీడింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి అధికార టీఆర్ఎస్ అభ్యర్ధి పేరును అధికారికంగా ప్రకటించారు. ఈటెల రాజేందర్ రాజీనామా అనంతరం రకరకాల పేర్లు తెరపైకి వచ్చినా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు. బీసీ వర్సెస్ బీసీనే బరిలోకి దింపారు. తొలుత కౌశిక్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. తర్వాత ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన పెద్దిరెడ్డే అభ్యర్ధి అంటూ అంచనాలు వెలువడ్డాయి.. కానీ సీఎం కెసీఆర్ బుధవారం నాడు అధికారికంగా గెల్లు శ్రీనిసవాయాదవ్ పేరును ప్రకటించారు. గెల్లు శ్రీనివాసయాదవ్ టిఆర్ఎస్ వి ప్రస్తుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు.
గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉస్మానియా యూనివర్సిటీ టిఆర్ఎస్ వి విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లుశ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో అరెస్టు అయి పలుమార్లు జైలుకెళ్లారు. ఫిరాయింపుదారులకే పార్టీలో పెద్ద ఎత్తున పదవులు ఇస్తున్నారని విమర్శలు వస్తున్న ఈ తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్పిస్తోంది. ఇక ఇప్పుడు మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో తేలాల్సి ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రాజకీయం అంతా దళిత బంధు చుట్టూనే తిరగనుంది.