Telugu Gateway
Telangana

రేవంత్ రెడ్డి నోట..సీతక్క సీఎం మాట

రేవంత్ రెడ్డి నోట..సీతక్క సీఎం మాట
X

రాజకీయాలు అంటేనే ఎత్తులు...పైఎత్తులు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే టార్గెట్ తో పనిచేస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ లో చేరికల జోష్ కూడా ఉంది. వాతావరణం అనుకూలంగా మార్చుకునే ప్రయతనాలు చేస్తున్నారు. మరో వైపు రేవంత్ రెడ్డి అంటే ఏ మాత్రం పడని కొంత మంది సీనియర్లు సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ను ప్రమోట్ చేస్తున్నారు. అంతర్గత సంబాషణల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా పీసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ని సీఎం కానిచ్చే ఛాన్స్ ఉండదనే చర్చ తెర మీదకు తెస్తున్నారు. దళిత కోణంలో సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కు ఛాన్సులు మెరుగ్గా ఉంటాయనే అంశాన్ని కూడా ప్రచారంలో పెడుతున్నారు. కొంత మంది అయితే కర్ణాటక అంశాన్ని ఉదాహరణ గా కూడా చూపుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, పీసిసి ప్రెసిడెంట్ డీ కె శివ కుమార్ పార్టీకి పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు సమకూర్చిన కూడా ఆయన్ను కాదని సిద్దరామయ్య కు సీఎం పదవి కట్టబెట్టిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తెలంగాలో కూడా రేవంత్ రెడ్డి ఎంత మేర నిధులు సమీకరించినా కూడా గెలిచిన తర్వాత కాంగ్రెస్ లో లెక్కలు వేరే ఉంటాయని చెపుతున్నారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి కు తెలియకుండా ఉండవు కదా. బహుశా ఈ విషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి పెద్ద స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది. అమెరికా లోని తానా సమావేశాల్లో అయన మాటలు చూస్తుంటే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు.

తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కొంత మంది ఎన్ఆర్ఐలు కోరగా రేవంత్ షాకింగ్ రిప్లై ఇచ్చారు. అవసరమైతే సీతక్కను సీఎం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, ఎస్సీ, ఎస్టీల పక్షాన నిలుస్తుందన్నారు. దళితుడైన మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దళితులు, గిరిజనులకు అనుకూలంగా ఉంటుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులు కావొచ్చన్నారు. పని చేసే వారికి గౌరవం కచ్చితంగా దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అవసరం అయితే సీతక్కను సీఎం చేస్తాం అని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చాలా మంది నేతలకు షాక్ అనే చెప్పొచ్చు అంటున్నారు ఆ పార్టీ నేతలు . తానా మీటింగ్ లో రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నే పోలవరం, అమరావతి ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తుంది అని ప్రకటించారు. రాహుల్ గాంధీ ఇదే విషయాన్నీ చెప్పారని...కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ నే అని...తమ పార్టీనే వీటిని పూర్తి చేస్తుంది అని వెల్లడించారు.

Next Story
Share it