హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దారెటు?!
ఓ వైపు ఆర్ బిఐ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వరస పెట్టి వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతుంది. ఇది రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపించే అంశమే. మరో వైపు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఏడాది కాలంలో మాంద్యం చుట్టేయవచ్చని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కీలక సంస్థల సీఈవోలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు సైతం 2023లో మాంద్యం రావొచ్చని హెచ్చరించింది. ఈ తరుణంలో కొత్త ఇళ్లు కొనుగోలు చేయదలచిన వారు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మిగులు నిధులు ఉంటే ఓకే కానీ కేవలం జీతాల మీద ఆధారపడిన వారు..ఇతర రంగాల వారు భారీ పెట్టుబడి నిర్ణయాలపై పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇదేనని ఆర్ధిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఓ వైపు మాంద్యం భయాల సంగతి పక్కన పెట్టినా ఎన్నికల సమయంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ లో స్తబ్దత వస్తుందనే విషయం తెలిసిందే. వచ్చే ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తగ్గినట్లే తగ్గి హైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్ళు-ఆపార్ట్ మెంట్ల సంఖ్య మళ్ళీ దాదాపు లక్షకు చేరింది. ఇందులో ఏకంగా 21 శాతం రెడీ టూ మూవ్ విభాగంలో ఉన్నావే. మిగిలినవి వివిధ దశలో ఉన్న ఇళ్లు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంగ్ సంస్థ ప్రాప్ టైగర్ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం హైదరాబాద్ లో ఏకంగా 99,090 యూనిట్లు అమ్మకం కాకుండా ఉన్నాయి. వీటి అమ్మకానికి దాదాపు 41 నెలల సమయం పడుతుందని ఈ సంస్థ అంచనా వేసింది.
ఢిల్లీ రాజధాని ప్రాంతంతో పోలిస్తే ఇళ్ళ అమ్మకానికి అత్యధిక సమయం పట్టే మార్కెట్ హైదరాబాద్ కావటం విశేషం. ముంబయ్ లో అమ్ముడుపోని యూనిట్లు 2,72,960 ఉండగా..ఢిల్లీ రాజధాని ప్రాంతంలో ఇవి 1,00,770గా ఉన్నాయి. దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాల్లో కలుపుకుని మొత్తం 7.85 లక్షల అమ్ముడుపోని యూనిట్లు ఉన్నాయి. ఓ వైపు ఈ ఏడాది జులై-సెప్టెంబర్ కాలంలో దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 49 శాతం మేర పెరిగి 83,220 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 55,910గా ఉంది. విచిత్రం ఏమిటంటే ఓ వైపు అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి..అదే సమయంలో అమ్ముడుపోని యూనిట్ల సంఖ్య కూడా పెరుగుతూపోతుంది. అంటే మార్కెట్లో సప్లయ్ చాలా ఎక్కువగా ఉందని..అవసరానికి మంచి యూనిట్లు అందుబాటులోకి వస్తున్నాయనే విషయం ఈ లెక్కలు చెబుతున్నాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ ఏడాదిలో ఇళ్ళ ధరలు కూడా గరిష్టంగా 7 నుంచి 9 శాతం మేర పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇళ్లు కొనుగోలు చేయదలచిన వారు ఇప్పటికే పూర్తయిన వాటివైపు మొగ్గుచూపటమే సరైన నిర్ణయం అవుతుందని చెబుతున్నారు.