లోక్ సభ ఎన్నికల్లోనూ సవాళ్లు తప్పవు!
జాతీయ ఆశలు గల్లంతే!
దేశానికే దారిచూపుతా అన్న బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు ఇప్పుడు సొంత రాష్ట్రం తెలంగాలోనే దారులు మూసుకుపోయాయి. హ్యాట్రిక్ విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్న బిఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారు. దీంతో బిఆర్ఎస్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు అని టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. ఇది చాలా మంది పార్టీ నాయకులకు కూడా ఇష్టం లేదు. అయినా కెసిఆర్ నిర్ణయాన్ని కాదనే సాహసం ఆ పార్టీ లో ఎవరూ చేయరు అనే విషయం తెలిసిందే. అయితే పేరు మార్పు సంగతి కాసేపు పక్కనపెడితే ఇప్పుడు అటు రాష్ట్రం పోయి .. జాతీయ స్థాయిలో కూడా పెద్దగా పాత్ర పోషించటానికి ఉన్న అవకాశాలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయనే చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే సాగుతోంది. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ లోనే లోక్ సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. సహజంగా లోక్ సభ ఎన్నికలు అంటే ప్రధాన పోటీ జాతీయ పార్టీల మద్యే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందున....వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వీలు అయినంత మేర ఎక్కువ సీట్లు సాదించటానికి ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అధికారంలో ఉండటం కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు ఖచ్చితంగా ఎంతో కొంత కలిసి వచ్చే అంశం. మరో జాతీయ పార్టీ బీజేపీ కూడా లోక్ సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెడుతుంది అనే విషయం తెలిసిందే.
తెలంగాణాలో మొత్తం 17 లోక్ సభ సీట్లు ఉండగా...హైదరాబాద్ లోక్ సభ స్థానం ఎప్పుడూ ఎంఐఎం దే. అంటే ప్రధాన పార్టీలు పోటీ పడే సీట్లు పదహారు మాత్రమే. అయితే వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ ఇప్పుడు ఉన్న సీట్లలో చాలా వాటిని కోల్పోయే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం బిఆర్ఎస్ కు లోక్ సభలో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. తాజాగా వెల్లడైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిఆర్ఎస్ ఎక్కువ సీట్లు జీహెచ్ఎంసి పరిథిలోనే దక్కించుకుంది. తర్వాత ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే కరీంనగర్ జిల్లాలో పదమూడు సీట్లు గాను ఐదు అసెంబ్లీ స్థానాలు, మెదక్ లో పదిసీట్లకు ఏడు అసెంబ్లీ సీట్లు దక్కించుకుంది. ఈ లెక్కన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీ లను దాటుకుని బిఆర్ఎస్ గతంలో లాగా లోక్ సభ సీట్లను దక్కించుకోవటం సాధ్యం కాదు అన్నది ఆ పార్టీ నేతలు కూడా చెపుతున్నారు. కేంద్రంలో రాబోయేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా కెసిఆర్ పదే పదే చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణాలో అధికారం పోయింది. మరో వైపు కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్న ఆశలు నెరవేరటం కూడా కష్టమే అని చెప్పొచ్చు. తాజా ఫలితాలతో ఇతర రాష్ట్రాల ఎన్నికలపై ఆశలు బిఆర్ఎస్ ఫోకస్ పెట్టే అవకాశం పై కూడా పార్టీ నేతల్లో పలు అనుమానాలు ఉన్నాయి.