Telugu Gateway
Telangana

ఇద్దరి మధ్య తేడా స్పష్టం

ఇద్దరి మధ్య తేడా స్పష్టం
X

అధికారంలో ఉంటే ఒకలా..లేక పోతే మరోలా వ్యవహరించటం రాజకీయ పార్టీలకు అలవాటే. ఈ విషయంలో తెలంగాణాలో ప్రతిపక్ష బిఆర్ఎస్ ముందు వరసలో ఉంటుంది అనే చెప్పొచ్చు. ‘ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు. మేము ప్రజలకు మాత్రమే జవాబుదారులం. ఒక వేళ మేము తప్పు చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తారు. అంతే తప్ప మీరు చెప్పినట్లు మేము చేయం. ఇది మా ప్రభుత్వం ..మేము అనుకున్నదే చేస్తాము.’ అంతే కానీ మీరు చెప్పినట్లు చేయటానికి కాదు మేము ఇక్కడ ఉన్నది అంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా పలు మార్లు మాట్లాడారు. పలు అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సమయంలో ఇది అప్పటి బిఆర్ఎస్ పార్టీ, మాజీ సీఎం కెసిఆర్ స్పందన. పాత సచివాలయాన్ని పడగొట్టి కొత్తది కట్టడంతో పాటు పలు అంశాలపై కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సమయంలో కెసిఆర్ అన్న మాటలు ఇవి. పార్టీ లే కాదు..రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈ విషయాన్ని చూశారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కెసిఆర్ పాలనపై...అయన తీరుపై తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరి నెలరోజులు కూడా పూర్తి కాకముందే ప్రతిపక్ష బిఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు చూసి ప్రజలు కూడా అవాక్కు అయ్యే పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించవద్దు అని ఎవరూ అనరు. కానీ అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్లో కూర్చుని కూర్చోక ముందే విమర్శలు ఎక్కుపెట్టడం చూసి అవాక్కు అవ్వటం చాలా మంది వంతు అయింది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలు చూస్తే బిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం విషయంలో వంద రెట్లు ప్రజాస్వామ్యయుతంగా ఉన్నట్లే లెక్క. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కీలక హామీల అమలుకు వంద రోజుల గడువు ఉంది.

కానీ ఈ లోగానే బిఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న కామెంట్స్ చూసి సొంత పార్టీ నాయకులు కూడా అవాక్కు అయ్యే పరిస్థితి. అయితే ఇది అంతా కూడా త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం బిఆర్ఎస్ వేస్తున్న ఎత్తుగడగా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ క్రమంలో అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు లు మాట్లాడే మాటలు బిఆర్ఎస్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేసే అవకాశం ఉంది అనే చర్చ కూడా సాగుతోంది. బిఆర్ఎస్ తన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో హామీలు ఎలా అమలు చేసిందో అందరూ చూశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణ మాఫీ హామీ ..ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అమలు చేశారు. అది కూడా అసంపూర్తిగానే. ఇక నిరుద్యోగ భృతి హామీ అయితే ఊసెత్తలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అయితే..చెప్పిన దానికి చేసిన దానికి మధ్య వ్యతాసం చాలా ఉన్న విషయం తెలిసిందే. ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే అది ఓ పెద్ద జాబితానే అవుతుంది. ఇలాంటి చరిత్ర పెట్టుకుని కూడా బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ని నెల రోజులు కూడా పూర్తి చేయకముందే విమర్శలు స్టార్ట్ చేయటం చూసి వీళ్ళు ఇక మారరా అన్న చర్చ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అయితే గతానికి బిన్నంగా ఏ విషయంలో అయినా సరే అసెంబ్లీలో అందరితో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని చెపుతున్నారు. కెసిఆర్ అధికారం మాది...అంతా మా ఇష్టం అంటే...రేవంత్ రెడ్డి మాత్రం ఏ నిర్ణయం అయినా సరే అసెంబ్లీ లో సమగ్రంగా చర్చించిన తర్వాతే చేస్తామని చెపుతున్నారు. ఈ విషయంలో కెసిఆర్ ...రేవంత్ రెడ్డి తీరు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది అని చెప్పొచ్చు.

Next Story
Share it