లిక్కర్ టూ రియల్ ఎస్టేట్..కొత్త కొత్త విషయాలతో బిఆర్ఎస్ లో టెన్షన్!
లిక్కర్ స్కాం విచారణ స్కోప్ పెరుగుతోందా?!
ఫీనిక్స్ , దండు రాజేష్ పేర్లు రావటంతో కీలక నేతకు టెన్షన్!
‘రియల్ డీల్స్ గుట్టు’ వీడనుందా?!
బిఆర్ఎస్ నేతల్లో టెన్షన్..ఎన్నికల వేళ పార్టీ కి డ్యామేజ్ తప్పదనే భయం
ఎన్నికలకు ఆరు నెలల ముందు బిఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక వైపు స్వయంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె,ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసు లో ఆమె పలు మార్లు ఈడీ విచారణకు కూడా హాజరు అయ్యారు. తాజాగా ఈడీ కోర్ట్ కు సమర్పించిన అదనపు చార్జిషీట్ లో కవిత చేసిన ల్యాండ్ డీల్స్ గురించి ప్రస్తావించటం ఇప్పుడు బిఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. ఈడీ స్పష్టంగా ఎక్కడ.. ఎంత భూమి కొన్నారు...ఎన్ని చదరపు అడుగులు కొన్నారు అంటూ ఇవి బినామీ పేర్లతో ఎలా చేసింది పూసగుచ్చినట్లు వివరించింది. దీంతో ఇది లిక్కర్ తో ప్రారంభం అయి ఎక్కడ వరకు పోయి ఆగుతుందో అన్న టెన్షన్ ఆ పార్టీ నేతల్లో ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఐటి శాఖ అధికారులు హైదరాబాద్ లోని కీలక రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించటంతో పాటు పలు డాక్యుమెంట్స్, వివరాలు సేకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈడీ చార్జిషీటులో వట్టినాగులపల్లి భూముల వివరాలతో పాటు దండు రాజేష్, ఫీనిక్స్ పేర్లను ప్రస్తావించటంతో కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఉలిక్కి పడినట్లు చెపుతున్నారు.
వట్టినాగులపల్లిలోని వందల ఎకరాల భూములను ప్రభుత్వ పెద్దల అండదండలతో కొంత మంది గోల్ మాల్ చేశారని...ఈడీ దీనిపై ఇప్పటికే ఫోకస్ పెట్టినందున ఈ డీల్స్ విషయాలు అన్ని బయటకు వస్తే పెద్ద సంచలనమే అవుతుంది అని ఒక కీలక నేత వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం లో ఫీనిక్స్ కూడా కీలక పాత్ర అని చెపుతున్నారు. దండు రాజేష్ పేరు అటు రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళ డీల్స్ చూస్తారు అనే పేరు ఉంది. ఇప్పుడు ఈడీ చార్జిషీట్ లో అయన పేరు రావటం పెద్ద సంచలనం అయింది. వేల కోట్ల రూపాయల విలువ చేసే వట్టినాగులపల్లి ల్యాండ్ ను దక్కించుకునేందుకు కొంత మంది ధరణి పోర్టల్ ను కూడా వాడుకున్నారని..ప్రభుత్వంలోని పెద్దల అండదండలు లేకుండా ఇది అంత తేలికగా జరిగే వ్యవహారం కాదు అని ఒక ఐఏఎస్ అధికారి తెలిపారు. చూస్తుంటే ఢిల్లీ లిక్కర్ స్కాం స్కోప్ లిక్కర్ నుంచి రియల్ ఎస్టేట్ వైపు కూడా మళ్లే అవకాశం ఉంది అని...దీనికి కారణం ఇందులో దొరికే డీల్స్ లింక్ లను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది అని చెపుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాల్సిందే.