తీవ్ర చర్చనీయాంశంగా మారిన ప్రభుత్వ తీరు !

తెలంగాణాలోని రేవంత్ రెడ్డి సర్కారులో అంచనాలు పెంచకుండా ఒక్క పని కూడా ముందుకు సాగటం లేదు. కొత్తగా చేపట్టే పనులు అన్నిటిలో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. రోడ్డు ప్రాజెక్ట్ లతో పాటు బిల్డింగ్స్..ఇప్పుడు దేవాలయాల విషయంలో కూడా అదే సాగుతోంది. సరిగ్గా ఆరు నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిరేవుల సమీపంలో మూసి నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేశారు. అప్పుడు ప్రభుత్వం అధికారికంగానే 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయం అన్ని ప్రత్రికల్లో కూడా ప్రముఖంగా వచ్చింది. కానీ ఇదే దేవాలయానికి సంబంధించి శంకుస్థాపన జరిగిన ఆరు నెలల తర్వాత వచ్చిన జీవో లో మాత్రం ఇదే దేవాలయం అంచనా వ్యయం దగ్గర దగ్గర 250 కోట్ల రూపాయల మేర పెరిగింది. దీంతో ఇది ఏకంగా 949 కోట్ల రూపాయలకు చేరింది. దీంతో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తమ అవినీతికి చివరకు దేవాలయాలను కూడా వదలటంలేదా అన్న చర్చ సాగుతోంది ప్రభుత్వ అధికారుల్లో. తాజాగా తెలంగాణా సర్కార్ ఈ దేవాలయానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం దేవాలయ ఆర్కిటెక్చర్ పనులకు 598 .98 కోట్ల రూపాయలు..సివిల్, స్ట్రక్చరల్ వర్క్స్ కోసం 349.67 కోట్ల రూపాయలు కేటాయించారు.
ఈ మొత్తం 948 .65 కోట్ల రూపాయలు అయింది. వీటితో పాటు ఈ దేవాలయాన్ని అనుసంధానించేలా అభివృద్ధి చేయనున్న ఆరు లైన్ల రోడ్ కోసం మరో 159 .62 కోట్ల రూపాయలు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఈ మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 1108 .27 కోట్ల రూపాయలకు చేరింది. ఈ ఆరు లైన్ల రోడ్ విషయాన్ని పక్కన పెడితే ముందు ప్రకటించిన దానికంటే ఒక్క దేవాలయం నిర్మాణ అంచనా వ్యయమే దగ్గర దగ్గర 250 కోట్ల రూపాయల మేర పెరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ పై చేస్తున్న యుద్ధం కారణంగా స్టీల్ తో పాటు మరికొన్ని వస్తువుల ధరలు పెరిగినా కూడా మరీ ఇంత ఉండే అవకాశం లేదు అని ఇంజనీరింగ్ అధికారులు చెపుతున్నారు. కచ్చితంగా అంచనాల్లో గోల్ మాల్ ఉంది అన్నది ఎక్కువ మంది ఇంజినీర్లు చెపుతున్న మాట.



