తెలంగాణ టీడీపీ నిర్ణయం ఎవరికి నష్టం?!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చెపుతున్నట్లు 119 మంది నియోజక వర్గాల్లో అభ్యర్థులను బరిలో నిలిపితే ఓట్లు చీలి అది ఖచ్చితంగా అధికార బిఆర్ఎస్ మేలు చేస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. టీడీపీ బరి లో లేకపోతే మాత్రం ఆ పార్టీ ఓటు బ్యాంకు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి..ఒకప్పుడు టీడీపీ లో ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండటం ఒకటి అయితే... గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ కు కెసిఆర్ సహకారం అందించారు అనే కారణంతో వీళ్ళు అంతా కెసిఆర్ కు గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉండేది. రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడూ టీడీపీ పై ఎలాంటి విమర్శలు చేయకుండా ఆ పార్టీ ఓటు బ్యాంకు లో ఎక్కువ శాతం తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బిఆర్ఎస్ ఇప్పటికే రెండు సార్లు తెలంగాణాలో అధికారంలోకి రావటం, సీఎం కెసిఆర్ పై పలు వర్గాల్లో వ్యతిరేకత ఉన్నందున ఈ సారి కాంగ్రెస్ గెలుపు అవకాశాలు మెరుగు అయ్యే ఛాన్స్ ఉంది అనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు తాజా నిర్ణయం టీడీపీ ని అన్ని రకాలుగా దెబ్బ కొట్టిన కెసిఆర్ కు మేలు చేయటం కోసమే తీసుకున్నట్లు కనిపిస్తోంది అని ఒక టీడీపీ నాయకుడు కూడా అనుమానం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపెట్టుకోవటం వాళ్ళ కాంగ్రెస్ దారుణంగా దెబ్బ తిన్నదని ఆ పార్టీ నాయకులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ నిర్ణయం వెనక అసలు లెక్కలు ఏంటో రాబోయే రోజుల్లో అయినా బయటకు వస్తాయేమో చూడాలి.