తెలంగాణ సర్కారుకు హైకోర్టు షాక్
తెలంగాణ ప్రభుత్వంలో అంతా రహస్యమే. గత ప్రభుత్వాలు అన్ని జీవోలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లో పెట్టేవి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే విధానం అమల్లో ఉండేది. కానీ తెలంగాణ సర్కారు గత కొన్ని సంవత్సరాలుగా అసలు జీవోలు ఏవీ కూడా ప్రభుత్వ వెబ్ సైట్ లో పెట్టడం లేదు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు సర్కారుకు షాక్ ఇచ్చింది. జీవోలు వెబ్ సైట్ లో పెట్టడానికి మీకున్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవో విడుదల చేసిన 24 గంటల్లో వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ వేసిన పిల్‌పై సీజే హిమాకోహ్లీ, జస్టిస్ విజయ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. నిబంధనలు ఖరారు చేయకుండానే దళిత బంధును నిధులు విడుదల చేశారని పిటిషనర్ తెలిపారు. అయితే దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు వర్తిస్తుందని... నిబంధనలు ఖరారు చేసినట్లు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు వివరించారు. నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్ సైట్‌లో లేదని న్యాయవాది శశికిరణ్ తెలియజేశారు. ఏజీ వివరణను నమోదు చేసిన హైకోర్టు వాసాలమర్రిలో దళిత బంధుపై విచారణను ముగించింది. జీవోలన్నీ 24 గంటల్లో వెబ్‌సైట్‌లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.