Telugu Gateway
Telangana

తెలంగాణ అంత‌టా టీఆర్ఎస్ నిర‌స‌న‌లు

తెలంగాణ అంత‌టా టీఆర్ఎస్ నిర‌స‌న‌లు
X

అధికార టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా బుధ‌వారం నాడు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ రాజ్య‌స‌భ వేదిక‌గా రాష్ట్ర విభ‌జ‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ రాష్ట్ర మంత్రులు..ఎమ్మెల్యేలు ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో బిజెపి, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ దిష్టి బొమ్మ‌ల‌ను ద‌హ‌నం చేశారు. బైక్ ర్యాలీలు నిర్వ‌హించి..న‌ల్ల జెండాల‌తో కేంద్రానికి నిర‌స‌న తెలిపారు. హైద‌రాబాద్ లో కూడా ప‌లు చోట్ల టీఆర్ఎస్ పార్టీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టింది. న‌గ‌రంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ తోపాటు మ‌హ‌మూద్ అలీలు కూడా నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేశారు.

ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రధాని వ్యాఖ్యలు యావత్ తెలంగాణా సమాజాన్ని కించ పరిచేలా ఉన్నాయని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజీపీ నాయకులు వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను నెరవెర్చాల్సింది పోయి, తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖ‌మ్మంలో కూడా టీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. నిరసన ర్యాలీలో భాగంగా ఏర్పాటు చేసిన మోడీ శవయాత్రలో మంత్రి పువ్వాడ అజయ్, జిల్లా అధ్యక్షుడు తాత మధు పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్‌లో టీఆర్ఎస్ నాయకులు మానవహారం నిర్వహించారు. అన్ని జిల్లాలు..నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ ఈ నిర‌స‌న‌లు త‌ల‌పెట్టింది.

Next Story
Share it