Telugu Gateway
Telangana

బీజేపీ తో ఉండి కాంగ్రెస్ సీఎం పై ప్రశంసలు

బీజేపీ తో ఉండి కాంగ్రెస్ సీఎం పై ప్రశంసలు
X

తెలంగాణాలో టీడీపీ పునర్నిర్మాణం. రేవంత్ పాలనలో తెలంగాణా అభివృద్ధి. వెంట వెంటనే ఈ రెండు స్టేట్ మెంట్స్ చదివితే ఎవరికైనా ఇదేంటి అనిపించకమానదు. కానీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నోటి నుంచి వచ్చినవే ఈ రెండు ప్రకటనలు. వాస్తవానికి తెలంగాణాలో టీడీపీకి ఒకప్పుడు ఎంతోబలమైన నాయకులతో పాటు గ్రామస్థాయిలో కూడా బలమైన పునాదులు ఉన్నాయి. అలాంటి పార్టీని పూర్తిగా వదిలేసింది చంద్రబాబు నాయుడే . దీంతో తెలంగాణా తెలుగు దేశంలో ఉన్న వాళ్ళు ఎవరిదారి వాళ్ళు చూసుకున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఒక వైపు రేవంత్ రెడ్డి పాలన బాగుంది...రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధిపథంలో తీసుకెళుతున్నారు అని చెప్పిన తర్వాత టీడీపీ వైపు ఎవరైనా ఎందుకొస్తారు. నాయకులు ఎందుకు రిస్క్ చేస్తారు. అధికారంలో ఉన్న పార్టీకి స్వయంగా చంద్రబాబు నాయుడే సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత నిజంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా ఏమి చెపుతారు అన్న ప్రశ్న ఉదయించకమానదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాజకీయాలు పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు తిరుగులేని శక్తిగా ఉన్న బిఆర్ఎస్ ఇప్పుడు దిక్కులు చూసే పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో కొంత గౌరవప్రదమైన సీట్లు వచ్చినా కూడా లోక్ సభ ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి బిఆర్ఎస్ జీరో తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మరో వైపు వరసగా సాగుతున్న జంపింగ్ లు బిఆర్ఎస్ నాయకత్వాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ దశలో చంద్రబాబు ఏ తప్పటడుగు వేసిన అది బిఆర్ఎస్ కు మేలు చేయటం ఖాయం అనే అభిప్రాయం కూడా ఉంది. మరో వైపు తెలంగాణాలో వేగంగా ఎదిగేందుకు బీజేపీ రకరకాల వ్యూహాలు రచించుకుంటోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే అటు కేంద్రంలోనూ..ఇటు ఆంధ్ర ప్రదేశ్ లోనూ బీజేపీ తో కలిసి ప్రభుత్వంలో పాలు పంచుకుంటున్న చంద్రబాబు కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రికి కితాబు ఇవ్వటం కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి చంద్రబాబు చెపుతున్నట్లు తెలంగాణాలో టీడీపీ ని పునర్నిర్మాణం చేసి...ఆ లాభాన్ని బీజేపీ కి బదిలీ చేస్తారా...లేక అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారా?. ఏది ఏమైనా కూడా తెలంగాణ విషయంలో చంద్రబాబు చేసిన పరస్పర భిన్నమైన ప్రకటనలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశగా మారాయి. ఇది ఇలా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు, రేవంత్ రెడ్డి మీటింగ్ తో లబ్ది పొందాలని చూసిన బిఆర్ఎస్ కు ఇక్కడా పెద్ద నిరాశే ఎదురైంది అని చెప్పొచ్చు. ఈ మీటింగ్ కు ముందే రకరకాల ప్రకటనలు చేసిన బిఆర్ఎస్ నేతలు సమావేశం తర్వాత మౌనంగా ఉండాల్సి వచ్చింది.

Next Story
Share it