సింగిల్ డే..లిక్కర్ సేల్స్ 171 కోట్లు
కొత్త సంవత్సరం వస్తుంది అంటే...ఎక్కువ మంది కొనే సామాను మందే. ఏ కొనుగోళ్ళ బ్యాచ్ దానికే ఉంటారు. కానీ హవా మాత్రం మందు బ్యాచ్ దే. ఎందుకంటే డిసెంబర్ నెలలో..అది కూడా చివరి మూడు, నాలుగు రోజులు పార్టీలతో లిక్కర్ అమ్మకాలు దుమ్మురేపుతాయి. దీనికి తెలుగు రాష్ట్రాలు ఏదీ మినహాయింపు కాదు. కాకపోతే లెక్కల్లో కాస్త ఇటో ఇటో ఉంటాయి అంతే. డిసెంబర్ 31న అంటే శుక్రవారం ఒక్క రోజే తెలంగాణ రాష్ట్రంలో 171 కోట్ల రూపాయల మేర లిక్కర్ అమ్మకాలు సాగాయి. 1.76 లక్షల కేసుల లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు నమోదు అయ్యాయి. తెలంగాణలో మద్యం విక్రయాల్లో అత్యధిక రికార్డు సాధించింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఇక్కడ 42.26 కోట్ల రూపాయల అమ్మకాలు నమోదు అయ్యాయి.
24.78 కోట్ల రూపాయల అమ్మకాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే డిసెంబర్ నెల అంతా మందు మాసంగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఎందుకంటే గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ సారి డిసెంబర్ లో మద్యం అమ్మకాలు జరిగాయి. అది కూడా ఎవరూ ఊహించని రీతిలో. ఈ డిసెంబర్ నెలలో 3,435 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం డిసెంబర్‌లో 2,764 కోట్ల అమ్మకాలు మాత్రమే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఏపీలోనూ అమ్మకాల జోరు కన్పించింది. అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో అమ్మకాలు ఒకింత తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. డిసెంబర్ 31న అంటే శుక్రవారం నాడు ఏపీలో 124.10 కోట్ల రూపాయల అమ్మకాలు సాగాయి.