Telugu Gateway
Telangana

షెడ్యూల్ ప్ర‌కార‌మే పాఠ‌శాల‌లు ప్రారంభం

షెడ్యూల్ ప్ర‌కార‌మే పాఠ‌శాల‌లు ప్రారంభం
X

తెలంగాణ సర్కారు పాఠశాల‌లు ప్రారంభించేందుకే నిర్ణ‌యం తీసుకుంది. అయితే హైకోర్టు ఆదేశాల మేర‌కు ఆన్ లైన్, ఆఫ్ లైన్ క్లాసులు రెండూ ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ప్ర‌భుత్వ గురుకులాల పాఠ‌శాలలు, హాస్ట‌ళ్లు మిన‌హాయించి ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ పాఠ‌శాల‌లు య‌ధావిధిగా సెప్టెంబ‌ర్ 1 నుంచి ప్రారంభిస్తున్న‌ట్లు విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అయితే పాఠ‌శాల‌ల్లో హాజ‌రు త‌ప్ప‌నిస‌రి కాద‌న్నారు. హాజ‌రుపై పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు ఎలాంటి ఒత్తిడి చేయ‌కూడ‌ద‌న్నారు. విద్యార్థుల నుంచి ఎలాంటి స‌మ్మ‌తి ప‌త్రాల‌ను కోర‌వ‌ద్ద‌ని సూచించారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రత్యక్ష బోధన వద్దని వేసిన ఆ పిటిషన్‌పై మంగళవారం న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే ప్రత్యక్ష బోధనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రత్యక్ష బోధన కోసం పాఠశాలలకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు సూచించింది.

ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని, అలాగే ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసింది. ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలని, వారంలోగా మార్గదర్శకాలు విడుదల చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని, సెప్టెంబరు, అక్టోబరులో మూడో దశ పొంచి ఉందని హెచ్చరికలు ఉన్నాయని, అలాగే విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయంది.

Next Story
Share it