Telugu Gateway
Telangana

వీ 6 , వెలుగు పై బిఆర్ఎస్ బ్యాన్..కెటిఆర్ అలా చెప్పి ఇలా చేశారు

వీ 6 , వెలుగు పై బిఆర్ఎస్ బ్యాన్..కెటిఆర్ అలా చెప్పి ఇలా చేశారు
X

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కెటిఆర్ కొద్ది రోజుల క్రితం దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మీడియాను నియంత్రిస్తున్నారు అంటూ ఆరోపించారు. బీబీసీ నే నిషేదించారు ..మీరు ఒక లెక్క అంటూ కామెంట్ చేశారు. సీన్ కట్ చేస్తే అదే పని బిఆర్ఎస్ చేసింది. ఒక వైపు బిఆర్ఎస్ సొంత పత్రిక, టివీ పెట్టుకుని సొంత పార్టీ కి ప్రచారం చేసుకుంటారు ...ప్రత్యర్థి పార్టీ లపై విమర్శలు చేస్తూ, వాళ్ళను దెబ్బ తీసేలా టార్గెట్ కథనాలు రాస్తారు. అయినా కూడా మంత్రి కెటిఆర్ మాత్రం ఆ విషయం మర్చిపోయి ఇతర పత్రికలూ, టీవీ లపై విమర్శలు చేయటం విశేషం. కేంద్రంలో మోడీ ఏమీ చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారో...తెలంగాణ లో కూడా ఇంచుమించు అదే వాతారణం ఉంది అన్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో ఒకరిద్దరికి తప్ప ఎవరికీ మినహాయింపులు లేవు. ఏ ప్రధాన పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తే చాలు వాళ్లకు యాడ్స్ వెంటనే ఆగిపోతాయి...తెర వెనక ఇంకా చాలా చాలా జరుగుతున్నాయని మీడియా సర్కిల్స్ లో ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. ఒక వైపు తెలంగాణ లో ఏమి చేస్తున్నారో పూర్తిగా మర్చిపోయి...మోడీ పై మాత్రం ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో రెండు ప్రభుత్వాలకు పెద్ద తేడా ఏమీ లేదన్నది మీడియా సర్కిల్స్ లో ఉన్న మాట. తాజాగా వెలుగు పత్రిక , వీ 6 చానెల్స్ పై నిషేధం విధిస్తూ ప్రకటన జారీ చేశారు. ఆ ప్రకటన ఇలా ఉంది. ‘వి6 న్యూస్ ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీస్తూ, భారతీయ జనతా పార్టీకి కొమ్ముకాస్తున్న V6 ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది.

ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సదరు మీడియా సంస్థలు భారతీయ జనతా పార్టీ జేబు సంస్థగా మారి అబద్ధాలు, అసత్యాలు, కట్టుకథలతో BRS పార్టీ పైన, తెలంగాణ రాష్ట్రం పైన విషం చిమ్మడమే ఏకైక ఎజెండాగా పని చేస్తున్నవి. ఈ నేపథ్యంలో BRS పార్టీ మీడియా సమావేశాలకు V6, వెలుగు మీడియా సంస్థలను అనుమతించకూడదని నిర్ణయించింది. దీంతోపాటు ఈ సంస్ధలు నిర్వహించే చర్చలతో సహా, ఎలాంటి కార్యక్రమాల్లోనూ పార్టీ ప్రతినిధులెవరూ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది. బిజెపి గొంతుకగా మారి, విశ్వసనీయత కోల్పోయిన ఈ మీడియా సంస్ధల అసలు స్వరూపాన్ని , ఎజెండాను తెలంగాణ ప్రజలు గ్రహించాలని BRS పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.’ అంటూ పేర్కొన్నారు. ఎన్నికల ఏడాది లో బిఆర్ఎస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర మీడియా సంస్ధలు ఒక బహిరంగ హెచ్చరిక వంటిది అనే చర్చ సాగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని బెదిరింపులు ఉంటాయో చూడాల్సిందే.

Next Story
Share it