Telugu Gateway
Telangana

కారు గేర్ మారింది..బిజెపి జోరు ఆగింది

కారు గేర్ మారింది..బిజెపి జోరు ఆగింది
X

ఉత్కంఠ పోరులో రెండు ఎమ్మెల్సీలు దక్కించుకున్న అధికార టీఆర్ఎస్

వరస ఓటములకు బ్రేక్. దుబ్బాక ఓటమి, గ్రేటర్ లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన అధికార టీఆర్ఎస్ తేరుకుంది. ఓ వైపు నిరుద్యోగుల ఆగ్రహం..ఉద్యోగుల అసంతృప్తి అధికార టీఆర్ఎస్ భట్టపద్రుల అభ్యర్ధులపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందనే అంచనాల మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనూహ్య ఫలితాలను సాధించింది. బిజెపి సిట్టింగ్ సీటును సైతం టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన దివంగత ప్రధాని పీ వీ నరసింహరావు కుమార్తె వాణిదేవి విజయం సాధించారు. దీంతో బిజెపి సిట్టింగ్ సీటును కోల్పోయినట్లు అయింది. పీవీ కుమార్తెను బరిలోకి దింపటం ద్వారా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ రచించిన వ్యూహం ఫలించిందనే చెప్పాలి. అంతే కాదు..గతంలో ఎన్నడూలేని రీతిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో విజయం కోసం చెమటోడ్చారు. ఏకంగా అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రకటనలు జారీ చేశారు. ఏది ఏమైనా అధికార టీఆర్ఎస్ రెండు ఎమ్మెల్సీ సీట్లను దక్కించుకోవటం ద్వారా తెలంగాణలో రాజకీయంగా తమకు తిరుగులేదని నిరూపించింది.

అదే సమయంలో ఈ ఫలితాలతో బిజెపి దూకుడుకు బ్రేకులు పడినట్లు అయింది. బిజెపి సిట్టింగ్ అభ్యర్ధి రామచందర్ రావుపై వాణిదేవి ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో గెలుపొందారు. అదే సమయంలో ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ప్ర,స్తావించుకోవాల్సిన అంశం ఏది అయినా ఉంది అంటే...అది తీన్మార్ మల్లన్న అంశమే. స్వతంత్ర అభ్యర్ధిగా నిలిచిన తీన్మార్ మల్లన్న ప్రొఫెసర్ కోదండరామ్ ను పక్కకు నెట్టి రెండవ స్థానంలో నిలవటం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఆయన తీన్మార్ మల్లన్నపై గెలిచారు. దీంతో అధికార టీఆర్ఎస్ తన సిట్టింగ్ సీటును దక్కించుకున్నట్లు అయింది. ఈ రెండు సీట్లను దక్కించుకోవటంతో అధికార టీఆర్ఎస్ భవన్ లో సంబరాలు నెలకొన్నాయి. అయితే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ మొదటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధులే ఆదిక్యత చూపుతూ వచ్చారు. చివరకు విజేతలుగా కూడా వారే నిలిచారు. ఫలితాల అనంతరం వాణిదేవి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఆమెను కెసీఆర్ అభినందించారు.

Next Story
Share it