Telugu Gateway
Telangana

భూములు అమ్మి స్కీములు అమలు కూడా గొప్పేనా?

భూములు అమ్మి స్కీములు అమలు కూడా గొప్పేనా?
X

పథకాలకు పేర్లు పెట్టి పైసలు పంచుడు కూడా ఒక గొప్ప విషయమా?. అదేనా పాలనకు గీటు రాయి. దానికి 75 వేల నుంచి 80 వేల పుస్తకాలు చదివిన సీఎం కెసిఆర్ కావాలా?.. ప్రపంచంలో రైతు బందును పుట్టించిందే నేనే ..ప్రపంచంలో దళిత బందును పుట్టించిందే నేనే అంటూ గురువారం నాడు ఎన్నికల ప్రచార సభల్లో కెసిఆర్ నేనే అంటూ చాలా గొప్పలు చెప్పుకున్నారు. అసలు ఈ పేరు పెట్టడంలో ఏమి ఇన్నోవేషన్ (వినూత్నత) ఉంది...పథకానికి పేరు పెట్టి డబ్బులు పంచటంలో కెసిఆర్ కనిపెట్టింది ఏంటి?. స్కీముల అమలుకు భూములు అమ్ముతున్నట్లు గతంలో కెసిఆర్, మంత్రి హరీష్ రావు లు బహిరంగంగా ప్రకటించారు. దళిత బంధు ప్రకటించిన సమయంలో కోకాపేట భూముల అమ్మకం ద్వారా వచ్చిన రెండు వేల కోట్ల రూపాయలను ఈ పథకానికి వాడతామని వెల్లడించారు. అంటే ప్రజల భవిష్యత్ అవసరాల కోసం ఉంచాల్సిన భూములు అమ్మి స్కీములు అమలు చేసి తాము గొప్ప పరిపాలన అందిస్తున్నాం అంటే ఎవరైనా నమ్ముతారా?. పాలనలో కొత్త మార్గాలు వెతికి...ప్రభుత్వ ఆదాయం పెంచి పేదలకు సాయం చేయటాన్ని ఎవరూ తప్పుపట్టరు.

కానీ ఒక వైపు భూములు అమ్ముకుంటూ....మరో వైపు ఓఆర్ఆర్ వంటి ప్రాజెక్ట్ లను దీర్ఘకాలానికి లీజ్ కు ఇచ్చి వేల కోట్ల రూపాయలు ఖజానాలో జమ చేసుకుని...ఆ నిధులను కూడా ఎన్నికల ముందు రాజకీయ అవసరాల కోసం వాడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఎన్నికల ఏడాదిలో ఎడా పెడా కెసిఆర్ సర్కార్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కంటే దారుణంగా వరసగా పత్రికల్లో యాడ్స్ ఇచ్చి మరీ ఎకరాల లెక్కన...గజాల లెక్కన ప్రభుత్వ భూములు అమ్మిన విషయం తెలిసిందే. కెసిఆర్, కేటీఆర్ లు చెప్పుకుంటున్నట్లు రాష్ట్రానికి పదేళ్లుగా అద్భుత పాలన ఇచ్చి సంపద సృష్టించి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చినట్లు. ఆ అమ్మే భూములు కూడా అత్యంత కీలకమైన ప్రాంతాల్లో అస్మదీయ కంపెనీలనే రంగంలోకి దింపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే కెసిఆర్ చెప్పే మాటలకూ..క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు మధ్య మిస్ మ్యాచ్ అవుతుంది అనే చెప్పొచ్చు. ఇవన్నీ చూస్తున్న తెలంగాణ ప్రజలు నవంబర్ 30 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it