Telugu Gateway
Telangana

తెలంగాణ కొత్త స‌చివాల‌యం ఇంకా చాలా దూరం!

తెలంగాణ కొత్త స‌చివాల‌యం ఇంకా చాలా దూరం!
X

షెడ్యూల్ ప్ర‌కారం డిసెంబ‌ర్ కే పూర్తి కావాలి

ముఖ్య‌మంత్రి కెసీఆర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న తెలంగాణ నూత‌న స‌చివాల‌యం నిర్మాణం ఇప్ప‌ట్లో పూర్త‌య్యేలా లేదు. షెడ్యూల్ ప్ర‌కారం అయితే కొత్త స‌చివాల‌యం ఈ డిసెంబ‌ర్ కు సిద్ధం కావాల్సి ఉంది. తాజా అంచ‌నాల ప్ర‌కారం ఇది రెడీ కావ‌టానికి క‌నీసం ఇంకో ఆరు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. తొలుత కొత్త స‌చివాల‌య ప‌నులు 400 కోట్ల రూపాయలతో పూర్తి అవుతాయ‌న్నారు. కానీ కొద్ది రోజుల‌కే ఈ అంచ‌నాల‌ను ఏకంగా 619 కోట్ల రూపాయలకు పెంచేశారు. ఆరు ఫోర్లు..ఆరు లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ నిర్మాణానికి 400 కోట్ల రూపాయలు అవుతుందని తొలుత లెక్క‌లు క‌ట్టారు. కానీ త‌ర్వాత ఒక ఫ్లోర్ పెంచారు. అంటే మరో లక్ష చదరపు అడుగులు మాత్ర‌మే యాడ్ అయ్యాయి. అంటే ఒక ఫ్లోర్ కు ..లక్ష చదరపు అడుగులకు అంచనా వ్యయం ఏకంగా 219 కోట్ల రూపాయల మేర జంప్ చేసింది. ఇప్పుడు ప‌నులు పూర్త‌య్యే నాటికి అంచ‌నా వ్య‌యం ఇంకా ఎంత పెరుగుతుందో వేచిచూడాల్సిందేనంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే ముఖ్య‌మంత్రి కెసీఆర్ గురువారం నాడు నూత‌న స‌చివాల‌యం ప‌నుల‌ను ప‌రిశీలించారు. నూతన సచివాలయ నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి ఆయ‌న అధికారులను ఆదేశించారు. వేగవంతంగా జరుగుతున్న పనుల పురోగతిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

తుది దశ నిర్మాణంలో చేపట్టవలసిన ఎలివేషన్ తదితర ప‌నుల కోసం కెసీఆర్ తగు సూచనలు చేశారు. సచివాలయం బాహ్య అలంకరణలో భాగంగా గోడలకు వేసే గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్స్, తదితర మోడల్స్ ను అధికారులు ప్రదర్శనకు పెట్టారు. వాటిని నాణ్యతను కలర్ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి ఎలివేషన్ ప్రకాశవంతంగా, సుందరంగా కనిపించేలా ఉండాలని సూచించారు. వాల్ గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్స్, యూపీవీసీ విండోస్, అల్యూమినియం ఫాబ్రికేషన్స్, మెట్లకు వేసే గ్రానైట్స్, ఫ్లోరైడ్ మార్బుల్స్, గ్రానైట్స్ పలు రకాల మోడళ్లను అధికారులు సీఎం కేసీఆర్ ఎదుట ప్రదర్శించారు. మోడల్ వాటర్ ఫౌంటేన్, లాండ్ స్కేప్, విశ్రాంతి గదులు, మీటింగ్ హాళ్లను సీఎం పరిశీలించారు. స్కై లాంజ్ నిర్మాణం గురించి సిఎం కెసిఆర్ కు అధికారులు వివరించారు. కొత్త సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని, అందులో మంచి అంశాలను స్వీకరించాలని సూచించారు.

Next Story
Share it