Telugu Gateway
Telangana

కెసిఆర్ ముహూర్తం వర్క్ అవుట్ కాలేదు

కెసిఆర్ ముహూర్తం వర్క్ అవుట్ కాలేదు
X

ఆగమేఘాల మీద సిద్ధం అవుతున్న తెలంగాణ సచివాలయానికి మరో బ్రేక్ పడింది. ఈ సచివాలయాన్ని సీఎం కెసిఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17 న ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలిచారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డు రావటంతో దీనికి బ్రేకులు వేయాల్సి వచ్చింది. అనుకున్న సమయం ప్రకారం సచివాలయం ప్రారంభించేందుకు ఈసితో సంప్రదింపులు జరిపినా సానుకూల స్పందన రాలేదు అని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అనివార్యంగా కార్యక్రమం వాయిదా వేయాల్సి వచ్చింది. తాజా ఎన్నికల సంఘం . ఏపీ, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్రారంభోత్సవానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

మార్చ్ 15 తర్వాత ముహూర్తం చూసుకుని కొత్త తేదీని ఖరారు చేయాల్సి ఉంది.కొద్ది రోజుల క్రితం తెలంగాణ సెక్రటేరియట్ లో జరిగిన అగ్నిప్రమాదం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్త సచివాలయంపై ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ అయితే తాము అధికారంలోకి వస్తే సచివాలయం పైన ఉన్న గుమ్మటాలు కూల్చుతామని హెచ్చరించారు. కేవలం ఎంఐఎం ను సంతృప్తి పర్చటానికే ఇలా చేసారని మండిపడ్డారు. తమి అధికారంలోకి వస్తే తెలంగాణ, భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా ఈ మార్పులు చేస్తామని తెలిపారు. అయితే బండి సంజయ్ వ్యాఖలపై మండిపడ్డ తెలంగాణ మంత్రులు ఆయనపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అసలు కెసిఆర్ పుట్టిన రోజు సెక్రటేరియట్ ప్రారంభించటం ఏమిటి అంటూ కూడా కొంత మంది విమర్శలు చేశారు. ఇదేమైనా రాజరికమా అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఇప్పుడు కెసిఆర్ పెట్టిన ముహూర్తం కలిసి రాలేదు.

Next Story
Share it