కాంగ్రెస్ లో నిలదొక్కుకుని...పార్టీని నిలబెట్టిన లీడర్
తెలంగాణాలో కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చటంలో రేవంత్ రెడ్డి కృషిని గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం సిఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి ని ఎంపిక చేసింది. సోమవారం ఉదయమే అధిష్ఠానం దూతలు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే ల అభిప్రాయాన్ని సేకరించి ఢిల్లీకి పంపారు. అంతకు ముందు కాంగ్రెస్ తరపున గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు సీఎం ఎంపిక నిర్ణయం బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేశారు. సీఎం రేస్ లో సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా కూడా త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలు...రాష్ట్రంలో కెసిఆర్ తర్వాత ప్రజాదరణ ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. అటు కాంగ్రెస్ నేతలతో పాటు ఎక్కువ మంది మాత్రం సీఎం పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వటమే సరైన నిర్ణయం అన్న అభిప్రాయంతో ఉన్నారు. సిఎల్పీ సమావేశం తర్వాత సీఎం ఎంపిక వ్యవహారం ఢిల్లీ కి చేరింది. రాష్ట్రానికి పరిశీలకుడిగా వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీ కే శివ కుమార్, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే లు ఢిల్లీ వెళ్లి ఇదే అంశంపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో సమావేశం అయ్యారు. ఆయన నివాసంలో జరిగిన భేటీలో రాహుల్ గాంధీ, కే సి వేణుగోపాల్ లు కూడా పాల్గొన్నారు. అక్కడే నిర్ణయం జరిగిపోయింది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కే సి వేణుగోపాల్ మీడియా తో మాట్లాడుతూ డైనమిక్ లీడర్ అయినా రేవంత్ రెడ్డి నే సిఎల్పీ నేతగా ప్రకటించారు. ఈ ప్రకటన సమయంలో ఆయనతో పాటు సీఎం రేస్ లో నిలిచినా మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.