Telugu Gateway
Telangana

రైతు చట్టాలకు వ్యతిరేక ధర్నాలో తెలంగాణ మంత్రులు

రైతు చట్టాలకు వ్యతిరేక ధర్నాలో తెలంగాణ మంత్రులు
X

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే టీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే భారత్ బంద్ జరిగే డిసెంబర్ 8న తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా ధర్నాల్లో పాల్గొనాలని మంత్రి కెటీఆర్ కోరారు. ఆయన ఆదివారం సాయంత్రం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కెటీఆర్ మాటలు ఆయన వ్యాఖ్యల్లోనే...'కేంద్రం తీసుకొచ్చిన రైతు బిల్లులు అవి నల్లచట్టాలు. పార్లమెంట్ వేదికగా కేంద్ర వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాం. రాజ్యసభలో కేంద్రం మందబలంతో బిల్లులను ఆమోదింపజేసుకుంది. ఎముకలు కొరికే చలిలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కేంద్రంతో పోరాడుతున్నారు. పోరాటం చేస్తున్న రైతులకు టీఆర్ఎస్ పార్టీ సెల్యూట్ చేస్తుంది.

వారికి సంఘీభావంగా టీఆర్ఎస్ శ్రేణులు ఎల్లుండి బంద్ లో భాగస్వాములు కావాలి. రైతుబంధు సమితి సభ్యులు రైతులను కదిలించాలి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మా విన్నపం .. రైతులకు సంఘీభావంగా 2 గంటలు బంద్ చేయండి. కేంద్ర చట్టాలతో రైతు ఎలా ఇబ్బంది పడుతున్నాడు ? కార్పోరేట్లకు వ్యవసాయం ధారాదత్తం చేసే కుట్రలను వివరించండి . మోటారు వాహనాల యజమానులు బంద్ కు సహకరించాలి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు జాతీయ రహదారులపై మోహరించి ధర్నా, రాస్తారోకోలతో మద్దతు తెలపాలి. ఈ నల్లచట్టాలు పోయేదాకా రైతులకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుంది. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా రైతులకు మద్దతుగా నిలుద్దాం. ' అని పిలుపునిచ్చారు.

Next Story
Share it