Telugu Gateway
Telangana

కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌రా?

కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌రా?
X

ఢిల్లీ వేదిక‌గా తెలంగాణ మంత్రులు కేంద్రం తీరుపై మండిప‌డ్డారు. ధాన్యం కొనుగోలు అంశంపై క్లారిటీ తీసుకునేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రులు సోమ‌వారం నాడు అక్క‌డ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. రైతాంగానికి సంబంధించిన అంశాల మీద రాష్ట్రాల నుండి వచ్చినప్పుడు సమయం ఇచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కారమార్గం చూపించడం ప‌ద్ద‌తి అని తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేగాని ఇష్టముంటే కలుస్తం .. లేకుంటే లేదు అన్న ధోరణిలో కేంద్రప్రభుత్వం వ్యవహరించడం అభ్యంతరకరమ‌న్నారు. కేంద్రం వ్యవహారశైలి తెలంగాణ రైతాంగాన్ని అవమానించడమే .. వెంటనే పునరాలోచించి మంత్రుల బృందానికి సమయం కేటాయించాలని ఆయన కోరారు. ఈ మీడియా స‌మావేశంలో పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లు ఎంపీలు కేశవరావు , నామా నాగేశ్వరరావు , మంత్రులు గంగుల కమాలకర్ , ఎర్రబెల్లి దయాకర్ రావు , జగదీశ్వర్ రెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా 6952 కొనుగోలు కేంద్రాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నదని మంత్రి వెల్ల‌డించారు. కేంద్రం అనుమతించిన మేరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం టార్గెట్ సోమ‌వారంతో పూర్తి అవుతుంద‌ని, కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం తగ్గేందుకు ఆరబెట్టిన మరో 12, 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తూకాలకు సిద్దంగా ఉందన్నారు. టార్గెట్ పెంచాలని కేంద్రానికి ఇది వరకే విన్నవించడం జరిగిందని తెలిపారు. పండిన వరి ధాన్యం అంతా కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని నిరంజ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంతో ఇప్పటి వరకు అనేక చేధు అనుభవాలు ఉన్నాయ‌ని, అందుకే లిఖిత పూర్వక హామీ కోరుతున్నామ‌ని తెలిపారు. తాము రాజకీయాల కోసం ఢిల్లీకి రాలేద‌ని, రైతుల సమస్యలు కేంద్రానికి చెప్పేందుకు వచ్చామ‌న్నారు.

Next Story
Share it