మా కంటే ముందే మీడియా దగ్గరకు వచ్చారు
కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తీరుపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పీయూష్ గోయల్ వైఖరి అహంకారపూరితంగా ఉందన్నారు. వ్యవసాయ ప్రధాన దేశంలో ఒక రాష్ట్రం పట్ల కేంద్రం ఇటువంటి ప్రదర్శించడం వైఖరి అవాంఛనీయం అని ఆరోపించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తో తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం భేటీ అయింది. అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీరుపై మండిపడ్డారు. 'కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దుర్మార్గ పూరితంగా మాట్లాడారు .. మాకంటే ముందే పీయూష్ గోయల్ మీడియా వద్దకు ఆతృతగా వచ్చి తెలంగాణ ప్రభుత్వం రైతులను తప్పుదారి పట్టిస్తుందని చెప్పడం సిగ్గుచేటు. పండిన పంట కొనుగోలు బాధ్యత అంతా కేంద్రానిది .. కేంద్రానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద గాహన లేదు. ధాన్యం సేకరణకు, పప్పు దినుసుల సేకరణకు తేడా కేంద్రానికి తెలియడం లేదు. కేంద్రం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనుకోవడం అవివేకం. వడ్లను వడ్ల లాగా సేకరించాలి .. గోధుమల సేకరణ అంటే గోధుమ పిండి సేకరిస్తారా ?. బీజేపీకే తెలివి ఉంది .. ఇతరులకు లేనట్లు భావిస్తున్నారు.
దేశ రైతులను రోడ్డు మీద నిలబెట్టి, దాదాపు 700 మంది చావుకు కారణమైన సిగ్గులేని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఆఖరుకు రైతులకు చేతులెత్తి మొక్కి క్షమాపణ చెప్పింది నిజం కాదా ?. తెలంగాణ బీజేపీ సన్నాసులు మేం కొనిపిస్తాం మీరు వరి వేయండి అని రైతులను రెచ్చగొట్టారు. తెలంగాణ రైతులకు మేము విజ్ఞప్తి చేసి 50 లక్షల ఎకరాల వరి సాగును 30 లక్షలకు తగ్గించాం. కేంద్రంలో ఉన్నది రైతు, పేదల ప్రభుత్వం కాదు .. పొద్దున, మాపున లెక్కలు చూసుకునే వ్యాపారాత్మక ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం నీళ్లిచ్చి, కరెంటు ఇచ్చి , రైతుబంధు ఇచ్చి, రైతుభీమా ఇచ్చి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించింది .. ఇన్ని చేసినందుకు మాది రైతు వ్యతిరేక ప్రభుత్వమా ?. పండిన ధాన్యం కొనాల్సిన బాధ్యత ఉన్న కేంద్రం నిరాకరించడం దుర్మార్గం.
రైతుల ఆదాయం 2022 వరకు రెట్టింపు చేస్తామన్న కేంద్రం కనీసం రైతులు పండించిన పంటలను కొనకపోవడం సిగ్గుచేటు. ఈ దేశంలో ప్రజలను అన్ని విషయాలలో కేంద్రం మోసం చేసింది. తెలంగాణ ప్రజలకు, దేశ రైతాంగానికి కేంద్రం క్షమాపణ చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుంది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తి లేదని, కేంద్రం వివక్ష చూపుతుందని 2013లో రైతులతో సమావేశం పెట్టారు .. ఈ రోజు అదే సమాఖ్య స్ఫూర్తిని మోడీ నాయకత్వంలోని కేంద్రం దెబ్బ తీస్తున్నది. ఈ దేశ జీడీపీ పెంపుదలలో కేంద్రం విఫలమయింది. ఈ దేశంలో నిరుద్యోగం నియంత్రించడంలో కేంద్రం విఫలమయింది. ఇన్నేళ్లలో మోడీ పాలనలో ఎలాంటి నూతనత్వం లేదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరి దుర్మార్గం. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఈ విషయంలో ముందుకువెళ్తాం.' అని తెలిపారు.