జాతీయ పార్టీగా మారినా..కెటిఆర్ ఇంకా అక్కడే ఆగిపోయారా?

కెటిఆర్ ఇలా చెపుతుంటే...పార్టీ స్టాండ్ అందరికి ఒకేలా ఉండాలి కానీ...వర్కింగ్ ప్రెసిడెంట్ ది ఒక మాట...మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ప్రకటనలు చేస్తారు. ఆంధ్రా ప్రాంత ఓటర్లు ఎక్కువ ఉన్న చోట ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ పని చేశారు. తమ పార్టీ వాళ్ళు ఎవరైనా దీనిపై మాట్లాడితే అది వారి వ్యక్తిగతం అన్నారు. పార్టీ కి ఒక లైన్...మంత్రులు...ఎమ్మెల్యేకు ఒక లైన్ ఉంటుందా ఒకే విషయంలో. చంద్రబాబు అరెస్ట్ అంశం కోర్ట్ లో ఉంది అని..ఇది తమకు అనవసరం అని కేటీఆర్ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ మరో సారి స్పష్టం చేశారు. ఆంధ్రా లో ఉన్న సీఎం జగన్, పవన్ కళ్యాణ్, లోకేష్ అంతా తనకు స్నేహితులే అని...అక్కడ రెండు పార్టీల మధ్య సాగుతున్న రాజకీయ వివాదంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. శాంతి భద్రతల కోణంలోనే హైదరాబాద్ ఐటి సెక్టార్ లో ధర్నాలు..నిరసనలకు అనుమతి ఇవ్వలేదు అని...ఈ విషయంలో ఏమి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లోనే చేసుకోవాలని కెటిఆర్ సూచించారు. ఇక్కడ కెటిఆర్ మరో కీలక అంశాన్ని మర్చిపోయారు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా మర్చి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశం అంతా పోటీ చేస్తాం అని ఒక వైపు కెసిఆర్ చెపుతుంటే కెటిఆర్ మాత్రం ఇంకా ప్రాంతీయవాదంతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రా ప్రదేశ్ తో సంబంధం లేదు అన్నప్పుడు ఆ రాష్ట్రానికి బిఆర్ఎస్ అధ్యక్షుడుగా తోట చంద్ర శేఖర్ ను ఎందుకు నియమించినట్లు?. మొత్తానికి కెటిఆర్ తన వ్యాఖ్యల ద్వారా పార్టీ కి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తున్నారు అనే చర్చ సాగుతోంది.



