Telugu Gateway
Telangana

తెలంగాణా ప్రభుత్వంలో వివాదాలు సమసిపోతాయా!

తెలంగాణా ప్రభుత్వంలో వివాదాలు సమసిపోతాయా!
X

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం వేడి రోజురోజుకు పెరుగుతోంది. పైకి ఇంకా ఆ సెగలు కనిపించకపోయినా లోపల మాత్రం బాగా కుతకుతలాడుతోంది. అయితే ఇది ఎప్పుడు బయటకు వచ్చి ...కాంగ్రెస్ పార్టీ ని మరింత డ్యామేజ్ చేస్తుందో అన్న భయం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా కీలక పదవుల్లో ఉన్న వాళ్ళ మధ్య పట్టాదారులు వర్సెస్ కౌలుదారులు అన్న రీతిలో వ్యవహారం సాగుతోంది అని ఒక మంత్రి వెల్లడించారు. ఎప్పటి నుంచో పార్టీ లో ఉన్న నాయకులను పక్కన పెట్టి ఇప్పుడు పూర్తిగా కొత్తవాళ్లు అందరిపై పెత్తనం చేయాలనీ చూస్తుండటం కొంత మంది మంత్రులకు ఏ మాత్రం నచ్చటం లేదు. రాజకీయాల్లో పట్టాదారులు..కౌలుదారులు అనే వాదనకు బలం లేకపోయినా కూడా కొంతమంది పరిధి మించి మరీ వ్యవహరిస్తున్న తీరుతో ఎక్కువ మంది ఈ వాదన ను తెర మీదకు తెస్తున్నారు. జాతీయ పార్టీల్లో అయితే అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపిస్తే వాళ్ళకే కీలక పదవులు దక్కుతాయి..ప్రాంతీయ పార్టీల్లో అయితే అధినేత నచ్చిన వాళ్ళకే సీట్లు అయినా..పదవులు అయినా వస్తాయి.

అంతే తప్ప పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నామన్నా అది పెద్దగా వర్క్ అవుట్ కాదు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి కొద్ది రోజుల్లోనే రెండేళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి...మంత్రుల మధ్య గ్యాప్ బాగా పెరగటం...ప్రభుత్వ వ్యవహారాలు కూడా అంతా సాఫీగా సాగుతున్నట్లు కనిపించకపోవటంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు మూటకట్టుకోవాల్సి వస్తోంది. ఎక్కువ మంది మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విషయంలో ఎక్కువ మంది సర్దుకు పోతున్నా కూడా కేవలం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి అసలు ప్రభుత్వంలో అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తుండం ఎక్కువ మంది మంత్రులకు, ఆ పార్టీ నాయకులకు ఏ మాత్రం మింగుడుపడటం లేదు. పొంగులేటి కి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తున్నారు అనే భావనతో ఎక్కువ మంది వీళ్లిద్దరిపై ఆగ్రహంగా ఉన్నట్లు మంత్రులు...ఎమ్మెల్యేల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కూడా ఒక దళిత మంత్రి ప్రభుత్వం లో పనులు అన్ని కూడా ఒక మంత్రికి చెందిన కంపెనీకి కేటాయించడాన్ని గట్టిగా ప్రశ్నించినట్లు చెపుతున్నారు. పార్టీ కోసం ఖర్చు పెట్టింది ఆయన ఒక్కరేనా...తాము పెట్టలేదా అని గట్టిగా మాట్లాడినట్లు సమాచారం. అన్నిటి కంటే దారుణం ఏంటి అంటే అధికార పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన పనులు చేయకపోగా...అదే పనులను ఒక మంత్రి ఎమ్మెల్యేను పక్కన పెట్టి సొంతంగా డీల్ చేసుకోవటం కొంత మంది ఎమ్మెల్యే ల ఆగ్రహానికి కారణం అయినట్లు కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. ఈ కారణంతో కొంత మంది ఎమ్మెల్యేలు ఏ మాత్రం భయపడకుండా ప్రభుత్వ పరువు పోతున్నా కూడా బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్నారు. ఆ మంత్రి విషయంలో పరిస్థితిని చక్క దిద్దాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కూడా మౌనంగా ఉండటంతో ఇద్దరూ కలిసి ఈ పని చేసారా అనే అనుమానం కూడా ఎమ్మెల్యేకు కలుగుతోంది. దీంతో వాళ్ళు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే ప్రకటనలు చేస్తున్నారు అని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళతో పాటు ఎమ్మెల్యేలు కూడా సొంత పనుల విషయంలో వివాదాలకు దిగి ప్రభుత్వ..పార్టీ పరువును బజారున పడేస్తున్నారు అని మరో మంత్రి వెల్లడించారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పదవి అప్పుడు పీసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి కే దక్కుతుంది అనే విషయం 90 శాతం మందికి పైగా తెలుసు. ఫైనల్ గా కూడా అదే జరిగింది. అయినా కూడా ఫలితాల తర్వాత సీనియర్ నేత, మాజీ పీసిసి ప్రెసిడెంట్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ సిఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క కూడా చివరి వరకు సీఎం పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. కానీ మంత్రి పదవుల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కడ బహిరంగ ప్రకటనలు చేసి వివాదాలకు కారణం కాలేదు. కానీ పొంగులేటి మాత్రం ఇందుకు బిన్నంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే చాలా విషయాల్లో సీఎం రేవంత్ రెడ్డి. పొంగులేటి ఒకటిగా ఉన్నారనే అనుమానాలు కూడా కీలక మంత్రుల్లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ లో ఉన్న సీనియర్ మంత్రులు..నేతల కంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసలైన కాంగ్రెస్ హక్కుదారుగా వ్యవహరిస్తున్న తీరే ఎక్కువ మందికి నచ్చటం లేదు అన్నది ఎక్కువ మంది నేతలు చెపుతున్న మాట. వీటికి తోడు కొంత మంది మంత్రుల తెర వెనక వ్యవహారాలు కూడా ఎప్పటికప్పుడు ఢిల్లీ కి చేరుతున్నాయి.

Next Story
Share it