అధిష్ఠానం వరకు వెళుతుందా...ఇక్కడే సెటిల్ అవుతుందా!

ఆ మంత్రిపై వచ్చిన ఆరోపణలు అన్ని ఇన్ని కావు. బహుశా తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆ మంత్రి చేసినంత దోపిడీ మరొకరు చేసి ఉండరు అనే చర్చ కూడా రాజకీయ, అధికార వర్గాల్లో ఉంది. కీలక శాఖలు చూసే ఆయనకు ఇప్పుడు ఊహించని పరిణామం ఎదురైంది అని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. ఒక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల మధ్య సయోధ్య అంతగా లేదు అని ప్రచారం సాగుతున్న వేళ ఆ కీలక మంత్రి పవర్స్ కట్ అయ్యాయి అని చెపుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఈ వ్యవహారంలో కీలక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒక లెవెల్ దాటిన తర్వాత తనకు తెలియకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దు అని ఆ మంత్రి శాఖకు చెందిన అధికారులను సీఎం ఆదేశించినట్లు చెపుతున్నారు. దీంతో ఇప్పుడు ఆ మంత్రి కూడా సీఎం పై రుస రుస లాడుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి కాబినెట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కొంత మంది మంత్రులు తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్లు ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.
ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ కీలక మంత్రి అధికారాలకు కత్తెర వేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. తనను కలిసిన కొంత మంది నేతల వద్ద సదరు మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్న మంత్రులు కొంత మంది తరచూ కలుసుకుంటూ తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు చెపుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కీలక మంత్రి అధికారాలకు కత్తెర పడిన విషయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఆయన విషయాన్నీ అధిష్ఠానం దగ్గరకు తీసుకువెళతారు..లేక ఇక్కడే సెటిల్ చేసుకుంటారా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పెద్దగా ఎక్కడా ఇతర మంత్రుల వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. కానీ ఆ శాఖపై వస్తున్న తీవ్ర విమర్శలతోనే ఆయన నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది అని చెపుతున్నారు. అయితే లోపల లోపల జరిగే విషయాలను ఇలా ఒకరికొకరు బయట పడేసుకుంటా పోతే పోయేది ప్రభుత్వం..పార్టీ పరువే అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.



