Telugu Gateway
Telangana

నరసింహారెడ్డి లేకుండా....విచారణ ముందుకే

నరసింహారెడ్డి లేకుండా....విచారణ ముందుకే
X

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు సుప్రీం కోర్ట్ లో కూడా చుక్కెదురు అయింది. బిఆర్ఎస్ హయాంలో సాగిన విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు..విద్యుత్ ప్రాజెక్ట్ ల అమలులో చోటుచేసుకున్న అవినీతిని నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియ‌ల్ క‌మిష‌న్‌ను రద్దు చేయాలంటూ కెసిఆర్ సుప్రీం కోర్ట్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై మంగళవారం వాదనలు జరిగాయి. సుప్రీం కోర్ట్ లో కెసిఆర్ కు ఒక్క విషయంలో మాత్రం ఊరట దక్కింది అనే చెప్పాలి. జ్యుడిషియ‌ల్ క‌మిష‌న్‌ చైర్మన్ జస్టిస్ నరసింహ రెడ్డి ని పదవి నుంచి తప్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. జస్టిస్ నరసింహ రెడ్డి మీడియా సమావేశం పెట్టడాన్ని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి డీ వై చంద్ర చూడ్ తప్పుపట్టారు. ఆయన్ను పదవి నుంచి తప్పించి కొత్త జడ్జిని నియమించి ముందుకు వెళ్లాలని ఆదేశించారు. సుప్రీం కోర్ట్ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే జస్టిస్ నరసింహ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాటికి కొత్త జడ్జి ని నియమిస్తామని సుప్రీం కోర్ట్ కు నివేదించింది. కొత్త జడ్జి ని నియమించి పాత నోటిఫికేషన్ ప్రకారం విచారణ నిర్వహించుకోవచ్చని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.

దీంతో కెసిఆర్ కోరుతున్నట్లు విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్రాజెక్ట్ ల అమలుపై విచారణ చేసే అధికారం ఈఆర్సీకి తప్ప విచారణ కమిషన్ కు లేదు అంటూ ఆయన చేసిన వాదనను సుప్రీం కోర్ట్ ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు అని తేలిపోయింది. సుప్రీం కోర్ట్ కేవలం జస్టిస్ నరసింహ రెడ్డి తీరును..ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయటాన్ని మాత్రమే తప్పు పట్టింది తప్ప...కమిషన్ ఏర్పాటు ను కానీ...అందులోని అంశాలపై ఎక్కడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో కెసిఆర్ వాదన సుప్రీం కోర్ట్ లో కూడా వీగిపోయినట్లు అయింది. దీంతో రేవంత్ రెడ్డి సర్కారు ఆదేశించినట్లు కెసిఆర్ విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్రాజెక్ట్ ల విషయంలో ఖచ్చితంగా కమిషన్ విచారణ ను ఎదుర్కోక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది అని చెప్పొచ్చు. తొలుత కెసిఆర్ ఇదే అంశంపై హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేస్తే హై కోర్ట్ కెసిఆర్ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. అక్కడ కూడా కెసిఆర్ కోరుకున్న ఊరట దక్కలేదు అనే చెప్పొచ్చు.

Next Story
Share it