Telugu Gateway
Telangana

పరిశ్రమల శాఖ డొల్లతనం బయటపెట్టిన ఎఫ్ జీజీ

పరిశ్రమల శాఖ డొల్లతనం బయటపెట్టిన ఎఫ్ జీజీ
X

తెలంగాణ సర్కారు విషయానికి వస్తే మాటలు ఎక్కువ..చేతలు తక్కువ అనే విషయం ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఇది నిజం అయిందనే చెప్పాలి. పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ లెక్కలకు...అయన బాధ్యతలు చూస్తున్న పరిశ్రమల శాఖ అధికారిక లెక్కలకు మధ్య కూడా తేడా ఉంటుందా?. అంటే అలాగే కనిపిస్తోంది ఈ లెక్కలు చూస్తే. మంత్రి కెటిఆర్ అటు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల విషయంతో పాటు..ఇటు ఉద్యోగాల కల్పన విషయంలోనూ ప్రజలకు దొంగ లెక్కలు చెప్పినట్లు స్పష్టం అవుతోంది. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్ జీజీ) విడుదల చేసిన ప్రకటన ఇదే విషయం చెపుతోంది. ఎఫ్ జీజీ విశ్వసనీయత ఉన్న సంస్థ. ప్రభుత్వ తప్పులను నిత్యం ఎత్తిచూపుతూ ఉంటుంది. అలాగే ఈ సారి పరిశ్రమల శాఖకు సంబంధించి పలు సంచనల విషయాలను బయటపెట్టింది. టి ఎస్ ఐ పాస్ కింద రాష్ట్రానికి 3 .3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు...22 . 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినట్లు మంత్రి కెటిఆర్ ఈ ఏడాది జనవరి 2 న మీడియా సమావేశంలో వెల్లడించగా...పరిశ్రమల శాఖ మాత్రం 2 .67 లక్షల కోట్ల పెట్టుబడులు, 17 .82 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని అధికారికంగా సమాచారం ఇచ్చింది. ఈ రెండింటి మధ్య భారీ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది.

అంతే కాదు ఇప్పటికి వరకు వచ్చిన పెట్టుబడులు...ఉద్యోగాల విషయంలో స్పష్టంగా చెప్పలేకపోయినట్లు ఎఫ్ జీజీ వెల్లడించింది. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే రియల్ ఎస్టేట్ కంపెనీల పెట్టుబడులతో పాటు పిండి మరలు, స్టోన్ క్రషర్లు వంటివి కూడా ఈ జాబితా లో చూపించారు అని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఎఫ్ జీజీ ప్రభుత్వాన్ని కోరింది. కొద్ది రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ఫాక్స్ కాన్ విషయంలో కూడా అలాగే చేశారు. ఈ కంపెనీ రాకతో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు వస్తాయని...తాటికాయంత అక్షరాల్లో చెప్పి...పదేళ్లలో అని కింద ప్రైవేట్ ప్రకటనల్లో షరతులు వర్తిస్తాయి అని చెప్పినట్లు చిన్న లైన్ లో చెపుతారు. ప్రచారం మాత్రం లక్ష ఉద్యోగాలు అని హోరెత్తిస్తారు. ఇది అంతా చూస్తుంటే ప్రభుత్వం కూడా డిస్కౌంట్ల పై ప్రజలను మోసం చేసే షాప్ లాగే వ్యవరిస్తోంది అనే అనుమానం రాక మానదు.

Next Story
Share it