Telugu Gateway
Telangana

డ్రగ్స్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు

డ్రగ్స్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు
X

తెలంగాణలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసు ఆ తర్వాత పూర్తిగా మరుగున పడిపోయింది. అసలు హైదరాబాద్ లో డ్రగ్స్ ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తామని ఈ కేసు విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రులు పదే పదే ప్రకటించారు. అంతే కాదు...దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ఆ తర్వాత అసలు కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. కేసు వెలుగులోకి సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులను పిలిచి విచారించారు. కానీ ఆ తర్వాత ఈ వ్యవహారం పూర్తిగా మరుగునపడిపోయింది. బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు కాసేపు దీనిపై చర్చ జరిగినా మళ్ళీ అంతే. ఈ తరుణంలో గురువారం నాడు హైకోర్టులో డ్రగ్స్ కేసు విచారణకు వచ్చింది.

ఈ కేసులో సిట్ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాని కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసుపై 2017 లో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉన్నందున ఎక్సైజ్ సిట్ పరిధి ఈ కేసు విచారణకు సరిపోదని తెలిపారు. సీబీఐ, ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వంటి కేంద్ర సంస్థలకు అప్పగించాలని రేవంత్ రెడ్డి తన పిల్ లో కోరారు. ఇదిలా ఉంటే దర్యాప్తునకు ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సిద్ధంగా ఉన్నాయని న్యాయవాది రచన రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈడీ, ఎన్ సీబీకి రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదని నివేదించారు. సిట్ దర్యాప్తు ఏ స్థితిలో ఉందో డిసెంబరు 10 లోగా తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసి కేసును వాయిదా వేసింది.

Next Story
Share it