Telugu Gateway
Telangana

కరోనా వేగంగా విస్తరిస్తుంటే..టెస్ట్ లు మెల్లగా పెంచుతారా?

కరోనా వేగంగా విస్తరిస్తుంటే..టెస్ట్ లు మెల్లగా పెంచుతారా?
X

తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం

కరోనా అంశం విషయంలో మరోసారి తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశమంతటా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంటే రాష్ట్రంలో అతి తక్కువ స్థాయిలో ఆర్ టీ పీసీఆర్ టెస్ట్ లు చేయటంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై ఏజీ స్పందిస్తూ మెల్లగా టెస్ట్ లు పెంచుతున్నామని చెప్పగా..వైరస్ వేగంగా విస్తరిస్తుంటే టెస్ట్ లు మెల్లగా పెంచటం ఏమిటని ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా నిర్ధారణకు అత్యధిక శాతం యాంటీజెన్ టెస్ట్ లు మాత్రమే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణకు చేపట్టిన చుర్యలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది.

అదే సమయంలో మద్యం దుకాణాలు, బార్లు, పబ్ లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రలో చేస్తున్న కరోనా టెస్ట్ ల్లో ఆర్టీ పీసీఆర్ పరీక్షలు 10 శాతం కూడా లేవని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్ టీపీసీఆర్ పరీక్షలు సత్వరమే పెంచాలని ఆదేశించింది. వివాహాలు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా పాజిటివ్, మరణాల రేటును వెల్లడించటంతోపాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, నిర్మాణ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలపాలని కోరింది. రాష్ట్రంలో కరోనా చికిత్స కేంద్రాల వివరాల పై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది.

Next Story
Share it