Telugu Gateway
Telangana

ఉద్యోగుల బకాయిల చెల్లింపుల్లో విపరీత జాప్యం

ఉద్యోగుల బకాయిల   చెల్లింపుల్లో   విపరీత జాప్యం
X

తెలంగాణ లో ప్రభుత్వాలు మారుతున్నా ఈ సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదు. ప్రతి ప్రభుత్వం తమ అంత గొప్పగా పాలించేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పుకుంటారు. కానీ జీవితాంతం ప్రభుత్వ సర్వీస్ చేసిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటానికి కూడా ప్రభుత్వాలు ఉద్యోగులను వేధిస్తున్నాయి. ఇది ఇప్పటికిప్పుడు పుట్టుకు వచ్చింది కాకపోయినా బిఆర్ఎస్ హయాం నుంచి ఉన్న ఈ సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటుతున్నా కూడా అలాగే కొనసాగుతోంది. తమకు చట్టబద్ధంగా రావాల్సిన పదవి విరమణ ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి ఇప్పించాలని ఎంతో మంది కోర్ట్ ను ఆశ్రయిస్తున్నారు. ఈ కేసు మరో సారి సోమవారం నాడు హై కోర్ట్ ముందు విచారణ కు వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిపై హైకోర్టు న్యాయమూర్తి నామవరపు రాజేశ్వర రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వందలాది మంది తెలంగాణ విశ్రాంత ప్రభుత ఉద్యోగులు తమ పదవీవిరమణ బాకాయిలు దాదాపు రెండేళ్లయినా ప్రభుత్వం చెల్లించడం లేదని గత ఏడాది కోర్టుని ఆశ్రయించారు. అందుకు స్పందిస్తూ న్యాయమూర్తి రాజేశ్వర రావు గారు ఆ బాకాయిలను సత్వరం చిల్లించాల్సిందిగా గత సంవత్సరం ఆదేశాలు ఇచ్చారు. అయితే, సంవత్సరం పైచిలుకు గడిచినా ఆ ఆదేశాలను ప్రభుత్వం పూర్తిగా అమలు చేయకపోవడంతో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు కోర్టు ధిక్కార నేరం కింద ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిపై చర్యలు కోరుతూ ఓ ఆరు నెలల క్రితం కోర్టును ఆశ్రయించారు. అనేక గడువుల తర్వాత గత గడువు సందర్భంగా న్యాయమూర్తి ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిని వ్యక్తిగతంగా హాజరై కోర్టు ధిక్కార నేర ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ "ఫాం వన్" జారీ చేస్తూ దాదాపు 644 కోర్టు ధిక్కార కేసులను ఈరోజుకి వాయిదా వేశారు.

అయితే ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి మాత్రం సోమవారం నాడు కూడా కోర్టుకి హాజరు కాలేదు. కొంతమంది ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ, అకౌంటెంట్ జనరల్ ఆఫీసుల తరపున కోర్టుకి హాజరు అయ్యారు. కోర్టు ఆదేశాల అమలుకోసం గతంలో చాలా సార్లు విజయవంతంగా కోర్టు ద్వారా గడువులు పొందిన ప్రభుత్వ న్యాయవాది ఈరోజు కూడా ఆర్థిక కార్యదర్శి కోసం వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ అభ్యర్థించడంపై న్యాయమూర్తి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "బకాయిలు చెల్లించాల్సిందిగా కోర్టు గత ఏడాది ఆదేశాలు ఇచ్చింది. వాటిని ఇప్పటివరకూ పూర్తిగా ప్రభుత్వం అమలు పరచలేదు. కోర్టు ధిక్కార నేర ఆరోపణలపై నోటీసులు జారీ చేసికూడా ఆరు నెలలు దాటింది. ఈ కాలంలోనే పదుల సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు మరణించిన వార్తలు వచ్చాయి.

వ్యక్తిగతంగా ఈరోజు హాజరు ఎట్టి పరిస్థితుల్లోనైనా కావాల్సిందిగా గత గడువు నాడు ఈ కోర్టు ఆదేశించింది. అయినా కూడా తను హాజరు కాకపోవడం పట్ల ఉపేక్షించేది లేదు," అని న్యాయమూర్తి రాజేశ్వర రావు అన్నారు. ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో మునిగి ఉన్నారనీ, కోర్టుకి రాలేక పోయారనీ, అందుకే ఈలోపు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ ఈరోజు కోర్టుకి ఉదయం విన్నపం సమర్పించామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్న సంగతి వాళ్లకి ముందే తెలిసినందున అలాంటి విన్నపం ఏదైనా ఉంటే ముందే సమర్పించి ఉంటే కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండేదనీ, అలా చేయకపోవడాన్ని ఈరోజు మాత్రం ఉపేక్షించేది లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. "ఈరోజు ఆరు నూరైనా ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. కావాలంటే ఈరోజు అర్థరాత్రి వరకైనా కావాలంటే నేను కోర్టు హాల్లోనే వేచి చూస్తాను. వ్యక్తిగత హాజరు నుంచి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదు" అని న్యాయమూర్తి రాజేశ్వర రావు గారు విస్పష్టంగా పేర్కొన్నారని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల తరపు న్యాయవాది సీ ఆర్ సుకుమార్ తెలిపారు.

Next Story
Share it