కుల గణన లెక్కలతో రాజకీయ లెక్కలు మారక తప్పదు !
కుల గణన లెక్కలతో రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయ లెక్కలు కూడా మారబోతున్నాయా?. అంటే అవుననే సమాధానం వస్తోంది. అధికారికంగా వచ్చిన కుల గణన లెక్కలతో రాబోయే రోజుల్లో మార్పులు, చేర్పులు చేయక తప్పదు అనే చర్చ అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఊపు అందుకుంది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం రాష్ట్రంలో బీసీల జనాభా 46 శాతం పైనే ఉన్నట్లు లెక్క తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా ఈ లెక్కలతో కూడిన నివేదిక విడుదల చేసింది. జనాభా లెక్కల వారీగా ఆయా వర్గాలకు రాజకీయ అవకాశాలు కలిపించాలన్నది తమ పార్టీ విధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. కుల గణనతో దేశానికి ఈ విషయంలో తెలంగాణ మోడల్ గా ఉంది అంటూ కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటే...తెలంగాణ పీసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్న విషయం తెలిసిందే. పార్టీ పగ్గాలు బీసీ చేతిలోనే ఉన్నా కూడా రాబోయే రోజుల్లో ఈ లెక్కలకు అనుగుణంగా మరో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా బీసీ లకు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో మల్లు భట్టి విక్రమార్క ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో ఎప్పటి నుంచో మంత్రివర్గ విస్తరణ పెండింగ్ లో ఉంది. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆరు పోస్ట్ లను భర్తీ చేయాల్సి ఉన్నా ఇది వాయిదా పడుతూ వస్తోంది.
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాది దాటినా కూడా పూర్తి స్థాయి మంత్రి వర్గం ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదు. ఈ ఖాళీల భర్తీతో పాటు తాజాగా వెల్లడైన లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఒక కీలక బిసి నేతను ఉప ముఖ్యమంత్రిని చేస్తేనే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కి లాభం ఉంటుంది అనే చర్చ సాగుతోంది. అలా కాకుండా కేవలం పంచాయతీ ఎన్నికల్లో జనాభా లెక్కల ప్రకారం సీట్లు ఇచ్చి...బిసికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే రాజకీయంగా పార్టీ ఇరకాటంలో పడే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది. మరో వైపు బీజేపీ కూడా కీలక నేత ఈటల రాజేందర్ ను తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం బలంగా ఉంది అని ప్రచారం జరుగుతోంది. ఒక వైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ తో పాటు బీజేపీ ను ధీటుగా ఎదుర్కోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ మరో కీలక బిసి నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం తప్పదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పలు అంశాలపై విమర్శలు ఎదుర్కొంటోంది. అలాంటిది ఇప్పుడు తాను అధికారికంగా సిద్ధం చేయించిన నివేదిక ప్రకారం ప్రభుత్వంలో చోటు కలిపించకపోతే రాజకీయ సమస్యలు రావటం ఖాయం అనే చెప్పొచ్చు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.