ఎల్ఆర్ఎస్ పై సర్కారు కీలక నిర్ణయం

ఎల్ఆర్ఎస్ వ్యవహారం గత కొన్ని రోజులుగా తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. అటు ప్రజల నుంచి ఇటు రాజకీయ పార్టీల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అందరూ ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు ఎల్ఆర్ఎస్ ను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ నేతృత్వంలో సాగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్ కొనసాగించవచ్చని స్పష్టం చేశారు. అయితే అనుమతులు లేని..క్రమబద్దీకరణ కాని కొత్త ప్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేసేందుకు నిరాకరించారు. కొత్త ప్లాట్లకు మాత్రం సంబంధిత సంస్థల అప్రూవల్ పొందిన తర్వాతే రిజిస్ట్రేషన్ జరగనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలిగాయి. అయితే ఎల్ఆర్ఎస్ లేని ఫ్లాట్లకు మాత్రం భవన నిర్మాణాల సమయంలో ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం.