Telugu Gateway
Telangana

తెలంగాణ‌లో రిజిస్ట్రేష‌న్ విలువ పెంపున‌కు సిఫార‌సు

తెలంగాణ‌లో రిజిస్ట్రేష‌న్ విలువ పెంపున‌కు సిఫార‌సు
X

తెలంగాణ‌లో భూముల విలువ‌లు పెర‌గ‌బోతున్నాయి. ఎప్ప‌టి నుంచో ఈ అంశం ప్ర‌తిపాద‌న‌ల ద‌శ‌లో ఉంది. అయితే మంత్రివ‌ర్గ ఉప సంఘం తాజాగా ప్ర‌భుత్వానికి ఈ మేర‌కు సిఫార‌సు చేయాల‌ని నిర్ణ‌యించ‌టంతో ఈ సారి ఇది అమ‌లు కావ‌టం ప‌క్కా అనే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి భారీగా పెరిగిన భూములు, ఆస్తుల విలువలు పెరిగాయ‌ని మంత్రివ‌ర్గ ఉప సంఘం పేర్కొంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఒక్కసారి రిజిస్ట్రేషన్ విలువను పెంచలేద‌ని..అదే స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్ లో గత ఎనిమిది సంవత్సరాల్లో ఏడు సార్లు రిజిస్ట్రేషన్ విలువలు పెరిగిన విష‌యాన్ని కూడా క‌మిటీ ప్ర‌స్తావించింది. ప్రస్తుతం ఆంధ్రాలో 7 శాతం, తమిళనాడులో 7.5 శాతం, మహారాష్ట్రలో 7 శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ విలువలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. హెచ్ఎండిఏ పరిధిలో 2019-20 సంవత్సరంలో ప్రభుత్వ విలువల కన్నా అధిక విలువతో 51 శాతం రిజిస్ట్రేషన్ ల నమోదు అవుతున్నాయ‌ని తెలిపారు. మార్కెట్ విలువ కన్నా చాలా తక్కువగా రిజిస్ట్రేషన్ విలువ ఉండడం వలన బ్యాంకు రుణాలు పొందడం లో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని గుర్తించారు. ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు భారీగా విలువ పెరిగింద‌ని తెలిపారు.

రాష్ట్ర అ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కె.తారకరామారావు, ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, స్టాంపులు , రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి , వివిధ శాఖల‌ అధిపతులు పాల్గొన్నారు. చట్ట ప్రకారం ప్రభుత్వం ఎప్పటికీ అప్పుడు విలువల సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నదని, ఇదే చట్టం ఆధారంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల్లో ఏడుసార్లు భూ విలువలను సవరించి, రిజిస్ట్రేషన్ ఫీజులను 7.5 శాతానికి పెంచిన విషయము ఈ సందర్భంగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. పక్కనే ఉన్న తమిళనాడులో 7.5, మహారాష్ట్రలో 7 శాతం గా రిజిస్ట్రేషన్ ఫీజులు ఉన్నాయని అధికారులు మంత్రులకు తెలిపారు. వివిధ కారణాల కార‌ణంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న భూముల విలువల సవరణ వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయానికి కేబినెట్ సబ్ కమిటీ వచ్చింది. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్కి త్వరలోనే అందించాలని నిర్ణయం తీసుకుంది.

Next Story
Share it