Telugu Gateway
Telangana

వ్యాక్సిన్ల కోసం తెలంగాణ సర్కారు గ్లోబల్ టెండర్లు

వ్యాక్సిన్ల కోసం తెలంగాణ సర్కారు గ్లోబల్ టెండర్లు
X

తెలంగాణలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగిపోయిన విషయం తెలిసిందే. సరిపడినన్ని వ్యాక్సిన్లు లేకపోవటం వల్లే ఈ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు ప్రకటించారు. కేంద్రం నుంచి వ్యాక్సిన్లు వస్తే తప్ప మళ్లీ ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యే సూచనలు కన్పించటం లేదు. ఈ తరుణంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ల సరఫరా కోసం గ్లోబల్ టెండర్లు పిలిచింది. దీని కోం షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ వైద్య సర్వీసులు మౌలికసదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడిసి) ఈ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్లోబల్ టెండర్ల ద్వారా 10 మిలియన్ డోసుల వాక్సిన్ సేకరించాలని తలపెట్టింది. ఈ టెండర్ కు సంబంధించి బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదీగా నిర్ణయించారు.

ఆరు నెలల్లో 10 మిలియన్ డోసుల వాక్సిన్ సరఫరా చేయాలని కండిషన్ పెట్టారు. నెలకు నిర్దేశిత మొత్తంలో సరఫరా చేస్తూ ఈ లక్ష్యాన్ని అందుకోవాల్సి ఉంటుంది. కేంద్రం కేవలం దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్ లో 50 శాతం మొత్తాలను నేరుగా కొనుగోలు చేసి అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. మిగిలిన అవసరాలను ఆయా రాష్ట్రాలే వ్యాక్సినేషన్ కోసం తయారీ సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. తెలంగాణ సర్కారు కూడా 18 సంవత్సరాల పైబడిన వారందరికీ తామే ఉచితంగా వ్యాక్సినేషన్ వేయించుతామని ప్రకటించింది.

Next Story
Share it