తెలంగాణలో విద్యా సంస్థలకు జనవరి 30 వరకూ సెలవులు
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కూడా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో సర్కారు అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగించింది. ఈ నెల 30 వరకూ సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జనవరి ప్రారంభంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8వ తేదీ నుంచే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
సంక్రాతిని కలిపేసుకుని ఈనెల 16 వరకు సెలవులు ఉండగా.. 17 నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా ఆంక్షలను 20వ తేదీకి వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించింది. దీంతో సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో తాజాగా ఒక్కరోజులో 1,963 కొత్త కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 22, 017గా ఉంది.