ప్రవీణ్ కుమార్ రాజీనామాకు ఆమోదం
అలా రాజీనామా చేశారు. ఇలా ఆమోదించేశారు. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో తెలంగాణ సర్కారు కూడా చాలా వేగంగా స్పందించింది. ఆరేళ్ళ సర్వీసు మిగిలి ఉండగానే ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) ప్రకటించిన విషయం తెలిసిందే. రాజీనామాను మెయిల్ లో సీఎస్ కు పంపిన తర్వాత..ఆయన సుదీర్ఘ లేఖను కూడా విడుదల చేశారు. అందులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు. 26 ఏళ్ల సర్వీస్‌లో 17 ఏళ్లు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. 2002 నుంచి 2004 వరకు కరీంనగర్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. మూడేళ్లు గ్రేహౌండ్స్ ఐజీగా పనిచేశారు. గురుకులాల కార్యదర్శిగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
స్వేరోస్ పేరిట సైన్యాన్ని తయారు చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. గురుకులాల్లో నియామకాలు, సరుకులు, మెటీరియల్ కాంట్రాక్టుల్లో ఇష్టారాజ్యం నడుస్తోందని తెలంగాణ సర్కారుకు ఫిర్యాదులు అందాయి. సంబంధిత మంత్రి పేషీకి తెలియకుండా ఇటీవల తొమ్మిది గురుకులాలకు ప్రిన్సిపాళ్ల నియామకం జరిగినట్లు నేరుగా సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన పనితీరుపై ప్రశంసలు ఎన్ని ఉన్నాయో..విమర్శలు కూడా అంతే ఉన్నాయి. అయితే ప్రవీణ్ కుమార్ విషయంలో సర్కారు ఏ మాత్రం సానుకూల అభిప్రాయంతో లేదని ప్రచారం జరుగుతోంది.