మోడీతో తెలంగాణ గవర్నర్ భేటీ

ప్రధాని నరేంద్రమోడీతో తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ భేటీ అయ్యారు. రెండు రోజులుగా ఆమె ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. బుధవారం సాయంత్రం ఆమె కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ బేటీ అయ్యారు. తెలంగాణతోపాటు ప్రస్తుతం ఆమె పుదుచ్చేరి అదనపు బాధ్యతలు కూడా చూస్తున్నారు. తెలంగాణ గవర్నర్ గా వచ్చిన తొలి రోజుల్లో ఆమె దూకుడు చూపించారు. కొద్ది రోజుల క్రితం కూడా ఆమె యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ల నియామకాలతోపాటు పలు అంశాల్లో ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే మధ్యలో మాత్రం మౌనంగా ఉన్నారు.
ఢిల్లీ నుంచి వచ్చే సంకేతాల ఆధారంగానే ఆమె భవిష్యత్ కదలికలు ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే గవర్నర్ తమిళ్ సై తెలంగాణ కేబినెట్ ఆమోదించి పంపిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డికి సంబంధించిన ఫైలు పెండింగ్ లో పెట్టారు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. గవర్నర్ వరస భేటీలకు అసలు కారణాలు ఏమిటో తెలియదు కానీ..భవిష్యత్ లో ఆమె వేసే అడుగులు మాత్రం స్పష్టమైన సంకేతాలు ఇవ్వటం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.