Telugu Gateway
Telangana

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పేర్లు తిరస్కరణ

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పేర్లు తిరస్కరణ
X

అసెంబ్లీ ఎన్నికల ముందు పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ గవర్నర్ తమిళ్ సై, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ల మధ్య సయోధ్య కుదిరింది అని అందరూ భావించారు. దీనికి కారణాలు కూడా లేక పోలేదు. తమిళ్ సై కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవంలో పాల్గొనటంతో పాటు బహుశా ఏ గవర్నర్ చేయని రీతిలో సచివాలయంలో సీఎం కెసిఆర్ ఛాంబర్ ను కూడా సందర్శించారు. అప్పటిలో ఈ పరిణామంపై ఉన్నతాధికారులు కూడా విస్మయం వ్యక్తం చేశారు. పలు వివరణలు కోరిన తర్వాత ఆర్ టిసి ని ప్రభుత్వాల్లో విలీనం చేసే కీలక బిల్లుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో విబేధాలు సమసిపోయినట్లే అంటూ ప్రచారం జరిగింది. ఈ తరుణంలో అంటే వచ్చే నెల మొదటివారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుంది అని భావిస్తున్న వేళ సీఎం కెసిఆర్ కు గవర్నర్ షాక్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయటానికి అర్హతలు అడ్డొస్తున్నాయంటూ ప్రభుత్వానికి తన నిర్ణయాన్ని తెలియచేశారు . అభ్యర్థులిద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు.. సేవా విభాగాల్లో పాల్గొన్నట్లు కనిపించలేదంటూ గవర్నర్ విడివిడిగా రాసిన లేఖల్లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) చెబుతోందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. గతంలో కౌశిక్‌రెడ్డి విషయంలో కూడా ఆమె ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారు.

కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి గవర్నర్‌కు పంపించింది. అప్పుడు కూడా కౌశిక్‌రెడ్డి ఎక్కడా సేవా కార్యక్రమాలు చేసినట్లు కనిపించలేదని తిరస్కరించారు. ఇప్పుడు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు కూడా అదే పరిస్థితి రిపీట్ అయింది. నిబంధల ప్రకారం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు గా నియమితులు కావాలంటే వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి..సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వారికీ చోటు కలిపిస్తారు. అయితే వీటిలో కూడా ప్రభుత్వాలు తమకు నచ్చిన రాజకీయ నాయకులను నియమించుకుంటూ పోతున్నాయి. గతంలో కూడా పలు మార్లు ఇలా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందులో తుది నిర్ణయం మాత్రం గవర్నర్ దే కావటంతో ఇవి పూర్తి విచక్షణ మీద ఆధారపడి ఉంటాయనే చెప్పొచ్చు. గవర్నర్ నిర్ణయంపై బిఆర్ఎస్ కు చెందిన మంత్రులు, నేతలు గవర్నర్ తమిళ్ సై పై విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళ్ నాడు లేదు బీజేపీ పదవిలో ఉన్న ఆమె గవర్నర్ కావొచ్చు కానీ...గవర్నర్ కోట ఎమ్మెల్సీ లు మాత్రం అందుకు అర్హులు కారు అని ప్రకటిస్తారా అంటూ మండి పడుతున్నారు. రాజ్ భవన్ వేదికగా ఆమె రాజకీయాలు చేస్తున్నారు అని...క్యాబినెట్ ఆమోదించిన పేర్లను తిరస్కరించటం ఏ మాత్రం సరి కాదు అంటూ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story
Share it