తెలంగాణ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
సీఎస్ కు గవర్నర్ ప్రోటోకాల్ తెలియదా?
తెలంగాణలో ఏమి జరుగుతుందో్ ప్రజలకు తెలుసు
రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ప్రజలు అంతా చూస్తున్నారని గవర్నర్ తమిళ్ సై వ్యాఖ్యానించారు. తన పర్యటనల సందర్భంగా జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పందిస్తూ ఇది వ్యక్తిగతంగా తమిళ్ సైను అమానించినట్లు కాదని..రాజ్ భవన్ ను, గవర్నర్ ఆఫీస్ కు జరిగిన అవమానంగా పేర్కొన్నారు. అయినా సరే ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకోవటంలేదని..ప్రజలే అన్ని విషయాలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళ్ సై బుధవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ ప్రొటోకాల్ ఏమిటో తెలియదా? అని ప్రశ్నించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని ప్రతిపాదించిన అభ్యర్ధి విషయంలో నిబంధనల ప్రకారం లేనందునే దాన్నినిలిపివేసినట్లు తెలిపారు. అంతకు ముందు రెండు ఎమ్మెల్సీల నియమకాన్నిఆమోదించిన విషయం ప్రస్తావిస్తూ నిబంధనల ప్రకారం లేకపోయినా ప్రభుత్వం ఏది చెప్పినా ఓకే అనాలనటం సరికాదన్నారు. అయితే ప్రభుత్వంతో తానెప్పుడూ ఘర్షణ కోరుకోలేదని..అన్ని విషయాల్లో సఖ్యతతోనే ఉన్నానన్నారు. ఎప్పుడైనా రాజ్ భనవ్ కు వచ్చి మాట్లాడొచ్చని తెలిపారు.
తానేమీ వివాదస్పద వ్యక్తినికాదని..అందరితో స్నేహపూర్వకంగా ఉంటానన్నారు. అయితే ప్రొటోకాల్ పాటించకపోవటం వంటి చర్యలు తన నిర్ణయాలను ప్రభావితం చేయలేవన్నారు. ఏ విషయంలో అయినా తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఎలుకల ఘటన తనను బాధించిందని తెలిపారు. ఆస్పత్రతుల్లో మౌలికసదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానితో సమావేశం అయిన సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘన తదితర అంశాలపై ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించగా..అన్ని విషయాలు ఆయనకు తెలుసని..ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం అనుసరించిన తీరుతోపాటు ప్రొటోకాల్ ఉల్లంఘనల అంశంపై తమిళ్ సై ప్రధానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.