తెలంగాణ ఇంటర్... తొలి ఏడాది ఫెయిలైన విద్యార్ధులంతా పాస్
తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇంటర్ తొలి ఏడాది ఫెయిల్ అయిన విద్యార్ధులందరిని పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీన్ని ఆసరా చేసుకుని నిర్లక్ష్యం వహించకుండా సెకండర్ ఇయర్ కోసం జాగ్రత్తగా ప్రిఫేర్ అవ్వాలన్నారు. ఈ విషయంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు. ఆమె శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక ప్రకటన చేశారు. ఫెయిల్ అయిన వారంతా కనీస మార్కులతో పాస్ చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ పలితాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం సరికాదన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పేరేంట్స్..ప్రతిపక్ష పార్టీలు కూడా బాద్యతతో వ్యవహరించాలని సూచించారు. ఇంటర్ బోర్డులో ఎక్కడా తప్పు జరగలేదన్నారు. వాల్యూయేషన్ లో ఎక్కడా తప్పు జరగలేదని, ఇంటర్ పరీక్షల ఫలితాల విషయంలో బోర్డు తప్పు లేదని తెలిపారు. కోవిడ్ కారణంగా రెండేళ్ల నుంచి విద్యా వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు.
దూరదర్శన్, యూట్యూబ్ ద్వారా కూడా విద్యార్ధులు పాఠాలు వినేలా పలు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వాట్సప్ గ్రూపు లు కూడా పెట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఫెయిల్ అయిన 2.30 లక్షల మంది పాస్ అయినట్లేనన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్ధులపై ఒత్తిడి పెంచాలని ప్రభుత్వానికి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు పెట్టామని..సిలబస్ కూడా ఏ మేరకు తగ్గించింది కూడా ముందే వారికి వివరించామన్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో రాజకీయ పార్టీలు..విద్యార్ధి సంఘాలు ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఉద్యమాలు చేస్తున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ వారందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ అంశంపై రకరకాలు గా తర్జనభర్జన పడి ఫెయిల్ అయిన వారంతా పాస్ అని నిర్ణయం తీసుకుంది.